
Mukesh Ambani Net Worth: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఆస్తి ఇటీవల 490 మిలియన్ డాలర్లు తగ్గింది. దీంతో ప్రపంచ కుబేరుల జాబితాలో నాలుగు స్థానాలు దిగజారారు. ఆసియాలోనే అత్యంత ధనవంతుల
జాబితాలో కూడా రెండో స్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయారు. ఈ ఏడాది ఆయన నికర ఆస్తి విలువ కూడా 20.8 బిలియన్ డాలర్లు తగ్గింది. ఈ నేపథ్యంలో ముఖేష్ అంబానీ సంవత్సరానికి ఎంత జీతం సంపాదిస్తారో ఇక్కడ తెలుసుకుందాం..
ముఖేష్ అంబానీ కంపెనీ నుంచి ఎలాంటి తీసుకోవడం లేదు. గత ఆరేళ్లుగా ఆయన జీతం తీసుకోకపోయినా.. సంపద బిలియన్ల డాలర్లు పెరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక నివేదిక ప్రకారం.. ముఖేష్ అంబానీ 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఎలాంటి జీతం, అలవెన్సులు, స్టాక్ ఆప్షన్లు లేదా పదవీ విరమణ ప్రయోజనాలను తీసుకోలేదు.
కోవిడ్ సమయంలో 2020 నుంచి ముఖేష్ అంబానీ శాలరీ తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు. అయితే అంతకుముందు 2008-09 నుంచి ఆయన వార్షిక జీతం రూ.15 కోట్లుగా ఉండేది. ఆయన దాదాపు 12 సంవత్సరాల పాటు అంతే జీతం అందుకున్నారు.
ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి శాలరీ అందుకోకపోయినా.. కంపెనీలో ఆయనకున్న వాటాయే ఆయనకు అతిపెద్ద ఆదాయం. అంబానీ కుటుంబం రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో 50 శాతానికి పైగా వాటాను కలిగి ఉంది.
కంపెనీ వ్యాపారం పెరుగుతున్న కొద్దీ.. షేర్ ధర కూడా పెరుగుతోంది. దీనివల్ల ఆయన సంపద అధికమవుతుంది. అందుకే జీతం లేకపోయినా ఆయన నికర ఆస్తి విలువ బిలియన్లలోనే ఉంటుంది.
ముఖేష్ అంబానీ వ్యక్తిగతంగా సుమారు 16.1 మిలియన్ల షేర్లు ఉన్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుకు రూ.6 డివిడెండ్ ప్రకటించడంతో ఆయన 96.6 మిలియన్ల డివిడెండ్‌ను అందుకున్నారు.
అంతేకాకుండా అంబానీ కుటుంబం, ప్రమోటర్ గ్రూప్ కంపెనీలు రిలయన్స్‌లో సుమారు 6,645 మిలియన్ల షేర్లను కలిగి ఉన్నాయి. ఈ షేర్లపై ప్రమోటర్ గ్రూప్ సుమారు రూ.3,987 కోట్ల డివిడెండ్‌ను పొందింది. అంటే ఈ సంవత్సరం అంబానీ కుటుంబం రిలయన్స్ నుంచి సుమారు రూ.3,996 కోట్ల మొత్తం లాభాలను అందుకుంది.
ముఖేష్ అంబానీకి అసలు ఆదాయం.. జీతం లేదా డివిడెండ్ల నుంచి కాకుండా రిలయన్స్‌లో ఆయనకున్న వాటా విలువ నుంచి వస్తుంది. ఉదాహరణకు రిలయన్స్ షేర్లు కొంత శాతం పెరిగినా.. ఆయన సంపద వేల కోట్ల రూపాయలు పెరగవచ్చు. అయితే షేర్ల విలువ పడిపోతే ఆయన నికర సంపద కూడా తగ్గుతుంది. ఇటీవల రిలయన్స్ షేర్ల విలువ తగ్గడంతో ఆయన సంపద దాదాపు 490 మిలియన్ డాలర్లు తగ్గింది.