హర్మూజ్ జల సంధిలోని ఒమన్ తీరంలో పలావు జెండా కలిగిన MT సెట్టెబెల్లో ఆయిల్ ట్యాంకర్‌పై అమెరికా జరిపిన దాడిలో ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. వీరిలో ఒకరు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన
మెరైన్ ఇంజినీర్ ఉన్నట్టు ఢిల్లీలో ఏపీ భవన్ అధికారులు ధ్రువీకరించారు. విశాఖపట్నానికి చెందిన సురేష్ పట్నాల ఈ దాడిలో మృతిచెందినట్టు పేర్కొన్నారు. ట్యాంకర్‌పై అమెరికా దాడులు అనంతరంపు గల్లంతైన ముగ్గురు భారతీయ నావికులు మృతిచెందినట్లు కేంద్రం గురువారం ప్రకటించింది. ఈ దాడిలో 21 మంది సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారు. మృతుల్లో ఏపీకి చెందిన మెరైన్ ఇంజినీర్ సురేష్ పట్నాల, హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన 23 ఏళ్ల ఆదిత్య శర్మ, యూపీకి చెందిన మరో సెయిలర్ ఉన్నారు.మెరైన్ చీఫ్ ఇంజినీర్ సురేష్ పట్నాల మృతిని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ అర్జా శ్రీకాంత్ నిర్దారించారు. 44 ఏళ్ల సురేష్‌కు భార్య భవానీ, ఇద్దరు కుమారులు (10, 13 ఏళ్లు) ఉన్నారు. భార్య భవానీ మాట్లాడుతూ.. వచ్చే 24 వ తేదీన తమ పెళ్లి రోజుని, అప్పటికి వచ్చేస్తారని అనుకుంటే ఇలాంటి వార్త వినాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మేము నలుగురం.. ఇప్పుడు ముగ్గురయ్యాం’’ అని ఆ విషాదం తమ కుటుంబంపై చూపిన ప్రభావాన్ని వివరిస్తూ సురేష్ భార్య భార్గవి కన్నీటిపర్యంతమయ్యారు. తమ తండ్రి మరణవార్త తెలిసినప్పటి నుంచి 13, 10 ఏళ్ల వయసున్న తమ ఇద్దరు కుమారులు దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నారని ఆమె చెప్పారు. కుటుంబ సభ్యుల ప్రకారం, సురేష్ దాదాపు ఐదు నెలల పాటు సముద్రంలో గడిపిన తర్వాత ఇంటికి తిరిగి రావడానికి ముందే, తన స్థానంలో మరొకరి కోసం ఎదురుచూస్తూ రిలీవింగ్ లెటర్‌ను అందుకున్నారు. ఆయన మెరైన్ ఇంజనీరింగ్ కేవలం ఒక వృత్తి మాత్రమే కాదని, అది సురేష్‌కు ఒక ఫ్యాషన్ అని ఆమె తెలిపారు. సురేష్‌కు వివాహమై జూన్ 24తో 15 ఏళ్లు పూర్తికానుండగా.. ఇంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది.