
Sunny Leone:రూ.2400 కోట్ల పెట్టుబడి మోసం కేసులో బాలీవుడ్ నటి సన్నీ లియోన్‌కు కర్ణాటక సీఐడీ నోటీసు జారీ చేసింది. అయితే ఆమె నిందితురాలు కాదని అధికారులు స్పష్టం చేశారు. ఒక సినిమా పాట కోసం తీసుకున్న
రూ.1 కోటి పారితోషికం మూలాన్ని తెలుసుకునేందుకు మాత్రమే ఆమెను విచారించనున్నారు.
బాలీవుడ్ నటి సన్నీ లియోన్ పేరు తాజాగా ఒక భారీ ఆర్థిక మోసం కేసులో వినిపిస్తోంది. అయితే ఆమె ఈ మోసంలో నిందితురాలు కాదని అధికారులు స్పష్టం చేశారు. కర్ణాటక రాష్ట్ర క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సీఐడీ) రూ.2400 కోట్ల పెట్టుబడి మోసం కేసుకు సంబంధించి ఆమెకు నోటీసు జారీ చేసింది.ఈ కేసు శివం అసోసియేట్స్ అనే సంస్థకు సంబంధించినది. సంస్థ ప్రమోటర్ శివానంద నీలన్నవార్ వేలాది మంది పెట్టుబడిదారుల నుంచి డబ్బులు సేకరించి మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సుమారు 40,700 మందికి 36 శాతం నుంచి 60 శాతం వరకు వార్షిక లాభాలు వస్తాయని చెప్పి డబ్బులు తీసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.
సీఐడీ వివరాల ప్రకారం, శివానంద్ నీలన్నవర్ 2023లో విడుదలైన కన్నడ సినిమా చాంపియన్‌ను నిర్మించారు. ఆ సినిమాలోని "డింగారా బిల్లి నాను" పాటలో సన్నీ లియోన్ ప్రత్యేక నృత్య ప్రదర్శన ఇచ్చారు. ఆ పాట కోసం ఆమెకు సుమారు రూ.1 కోటి పారితోషికం చెల్లించినట్లు సమాచారం. ఇప్పుడు సీఐడీ తెలుసుకోవాలనుకుంటున్నది ఒక్కటే. సన్నీ లియోన్‌కు చెల్లించిన ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? పెట్టుబడిదారుల నుంచి సేకరించిన నిధుల నుంచే ఆ చెల్లింపు జరిగిందా లేదా అనే అంశంపై అధికారులు విచారణ చేస్తున్నారు. అందుకే ఆమెను ప్రశ్నించేందుకు నోటీసు పంపించారు.
అయితే సన్నీ లియోన్ ఎలాంటి తప్పు చేయలేదని సీఐడీ అధికారులు స్పష్టంగా చెప్పారు. ఆమెకు కేవలం సమాచారం కోసం మాత్రమే నోటీసు ఇచ్చినట్లు తెలిపారు. కేసులో ఆమెను నిందితురాలిగా పరిగణించడం లేదని వెల్లడించారు. దర్యాప్తులో మరో ఆసక్తికర విషయం బయటపడింది. పెట్టుబడిదారుల డబ్బులో కొంత భాగాన్ని స్టాక్ మార్కెట్లో పెట్టుబడిగా పెట్టగా భారీ నష్టాలు వచ్చినట్లు సమాచారం. మరికొంత మొత్తాన్ని వ్యక్తిగత ఖాతాలకు బదిలీ చేసినట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం కేసులో ప్రధాన నిందితుడు శివానంద్ నీలన్నవర్ అరెస్టయ్యాడు.
సీఐడీ ఇప్పటికే అతనికి చెందిన 30కిపైగా బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసింది. అలాగే ప్రజల డబ్బుతో కొనుగోలు చేసినట్లు అనుమానిస్తున్న లగ్జరీ కార్లు, ఇతర ఆస్తులను కూడా స్వాధీనం చేసుకుంది. బాధిత పెట్టుబడిదారులకు డబ్బులు తిరిగి అందించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా సన్నీ లియోన్ ఇటీవల తెలుగు సినిమా త్రిముఖలో కనిపించారు. సినిమాలు, టెలివిజన్ కార్యక్రమాలు, వ్యాపారాల ద్వారా ఆమె మంచి ఆదాయం సంపాదిస్తున్నారు. మేకప్ బ్రాండ్లు, సువాసన ఉత్పత్తులు, రెస్టారెంట్ వ్యాపారం, ప్రొడక్షన్ హౌస్ వంటి అనేక రంగాల్లో ఆమె పెట్టుబడులు పెట్టారు.
ప్రస్తుతం ఈ కేసులో సన్నీ లియోన్ పాత్ర కేవలం సమాచారం అందించడానికే పరిమితమా? లేక దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయా? అనే అంశంపై అందరి దృష్టి ఉంది. అయితే ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం ఆమెపై ఎలాంటి ఆరోపణలు నమోదు కాలేదు.