
హైదరాబాద్: ఏపీ మద్యం స్కామ్‌లో కీలక సూత్రధారి రాజ్కెసిరెడ్డిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. లిక్కర్ స్కామ్‌కు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ కేసులో కీలక
సూత్రధారి రాజ్ కెసిరెడ్డి ఇళ్లతోపాటు మరో ఆరుగురి నిందితుల ఇళ్లలో ఇవాళ ఉదయం నుంచి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ పూర్వపు ఎండీ వాసుదేవరెడ్డి, ఆయన బంధువు నరసింహారెడ్డి ఇల్లు, కార్యాలయాల్లోనూ దాడులు కొనసాగుతున్నాయి. ఏపీ మద్యం కుంభకోణంలో రూ.వేల కోట్లు చేతులు మారాయన్న ఆరోపణలు ఉన్నాయి. హవాలా, మనీలాండరింగ్ ద్వారా నిధులు తరలించినట్లు ఈడీ గుర్తించింది. ఈ క్రమంలో నానక్‌రామ్‌గూడలోని నివాసంలో రాజ్కెసిరెడ్డిని ఈడీ అరెస్ట్ చేసింది. ఏపీలోని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఇల్లు, కార్యాలయంలోనూ సోదాలు కొనసాగుతున్నాయి.
వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన రూ.వేల కోట్ల విలువైన మద్యం కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. ప్రాథమిక విచారణ జరిపిన ఈడీ అధికారులు.. మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) కింద అభియోగాలు మోపి, తాజాగా ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు (ఈసీఐఆర్) నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కేసులో 33 మందిని నిందితులుగా చేర్చారు. వైకాపా ప్రభుత్వ పెద్దల తరఫున మద్యం కుంభకోణంలో అన్నీ తానై వ్యవహరించిన రాజ్ కెసిరెడ్డితో పాటు వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఆ పార్టీ మాజీ నేత విజయసాయిరెడ్డి, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం సీఎంవో కార్యదర్శిగా పనిచేసిన విశ్రాంత ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, భారతి సిమెంట్స్ పూర్తికాలపు డైరెక్టర్ గోవిందప్ప బాలాజీలతో పాటు ఏపీఎస్‌బీసీఎల్ పూర్వపు ఎండీ డి.వాసుదేవరెడ్డి, ఏపీఎస్‌బీసీఎల్ ప్రత్యేకాధికారి సత్యప్రసాద్, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ పూర్వపు డైరెక్టర్ సజ్జల శ్రీధర్‌రెడ్డి, మద్యం ముడుపుల వసూళ్లలో కీలకంగా వ్యవహరించిన రాజ్ కెసిరెడ్డి తోడల్లుడు ముప్పిడి అవినాష్‌రెడ్డి, వీరి అనుచరులు బూనేటి చాణక్య, టి.కిరణ్‌కుమార్‌రెడ్డి, సైఫ్ అహ్మద్‌తో పాటు మద్యం ముడుపుల సొత్తు రూటింగ్ కోసం వినియోగించిన పలు డొల్ల సంస్థల యాజమాన్యాలను నిందితులుగా ఈడీ చేర్చింది. దేశ చరిత్రలోనే ఇది అతిపెద్ద మద్యం కుంభకోణం కావటంతో పాటు సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి వసూలు చేసిన దాదాపు రూ.3,200 కోట్ల ముడుపులను కల్పిత, ఊహాజనిత కంపెనీల ద్వారా వివిధ దశల్లో రూటింగ్ చేసి అంతిమ లబ్ధిదారుకు చేర్చినట్లు ప్రాథమికంగా గుర్తించిన ఈడీ.. దర్యాప్తులో మూలాలను వెలికితీస్తోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
విజయవాడలో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి రహదారులు జలమయంగా మారాయి.
రేషన్ కార్డు కోసం తొమ్మిదేళ్లుగా ఎదురుచూస్తున్న ఆ కుటుంబానికి ఒక్కరోజులోనే పరిష్కారం చూపారు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.