
దాదాపు రెండు నెలలపాటు అలరించిన ‘ఐపీఎల్’ ముగిసింది. రోజూ మ్యాచ్ అప్డేట్లతో ఫ్యాన్స్ బిజీగా గడిపారు. మరి తమకు జూన్‌లో ఎంటర్టైన్మెంట్ లేదా? అనే నిరుత్సాహం రాకమానదు. ఎందుకు లేవు..! ఇవిగో మీ కోసం
రెండు ప్రపంచ కప్ సంగ్రామాలు సిద్ధమంటూ వచ్చేశాయి. అసలైన మజా మొదలయ్యేదే ఇప్పుడే మరి.. ఇంతకీ అవేంటో ఓ లుక్కేద్దామా..
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఆదరణ కలిగిన క్రీడల్లో ఫుట్‌బాల్ ప్లేస్ ముందుంటుంది. కోట్లాది మంది అభిమానులు మ్యాచులను చూసేందుకు ఎగబడతారు. మరి అలాంటి ఫుట్‌బాల్ ఆట ప్రపంచ కప్ సంగ్రామమే వస్తే.. అవునండోయ్.. జూన్ 11 నుంచి (భారత కాలమానం ప్రకారం జూన్ 12 అర్ధరాత్రి 12.30 గంటలకు..) వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. అమెరికా, కెనడా, మెక్సికో సంయుక్త ఆతిథ్యంలో ప్రపంచ కప్ జరగనుంది. ఈ మ్యాచ్‌ను వీక్షించాలనుకొనే భారత అభిమానులకైతే కాస్త నిరాశ తప్పదు. ఎక్కువ మ్యాచులు అర్ధరాత్రి, వేకువజామున సమయాల్లో జరగనుండటం గమనార్హం. రొనాల్డో, మెస్సీ, ఎంబాపె, నెయ్మర్.. ఇలా స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ల ఆటను చూసేందుకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు.
వరుసగా రెండు టీ20 ప్రపంచ కప్‌లను భారత పురుషుల జట్టు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మహిళల టీమ్ వంతు. గత వన్డే ప్రపంచ కప్‌ను నెగ్గిన ఉమెన్స్ టీమ్ జోష్ మీదుంది. ఇప్పుడు టీ20 ప్రపంచ కప్‌నూ నెగ్గాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. కప్పు కోసం జూన్ 12 నుంచి జులై 5 వరకు పన్నెండు టీమ్‌లు తలపడతాయి. ఈ టైటిల్‌ను నెగ్గితే.. వన్డే ప్రపంచ కప్, టీ20 ప్రపంచ కప్‌ను నెగ్గిన రెండో టీమ్‌గా భారత్ అవతరించనుంది. ఇంగ్లాండ్ ఆతిథ్యం ఇస్తోంది.
ఫుట్‌బాల్, మహిళల ప్రపంచ కప్ సంగ్రామాలు ఉన్నా సరే.. క్రికెట్ అభిమానులకు భారత పురుషుల జట్టు మ్యాచులు లేకపోతే కాస్త వెలితిగానే అనిపిస్తాయనడంలో సందేహం లేదు. మరి అలాంటి వారి కోసం ఇప్పటికే ఈ నెలలో ఒక టెస్టు మ్యాచ్ జరిగింది. కానీ, అంత మజా ఇచ్చినట్లుగా లేదు. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమేనని.. మున్ముందు సినిమా ఉందని షెడ్యూల్‌ను చూస్తేనే అర్థమవుతోంది.
జూన్ 13 నుంచి అఫ్గాన్‌తో మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. అది ముగియగానే.. సీనియర్ జట్టు ఐర్లాండ్‌తో రెండు టీ20లను (జూన్ 26 నుంచి) ఆడేందుకు అక్కడికి వెళ్లనుంది. అది కాస్త చిన్న జట్టు కదా అని మీరు అనేలోపే.. జులై వచ్చేస్తుంది. మొదటి రోజు నుంచి ఇంగ్లాండ్‌తో ఐదు టీ20ల సిరీస్ సిద్ధంగా ఉంటుంది. ఈ మధ్యలో ఇండియా A మ్యాచులూ ఎలాగూ ఓ వైపు అలరిస్తూనే ఉంటాయి. అన్నింటికంటే అతి ముఖ్యమైన విషయం.. వైభవ్సూర్యవంశీ అనే 15 ఏళ్ల కుర్రాడు జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేయనున్నాడు. ఐపీఎల్లో అదరగొట్టిన అతడు ఎలా ఆడతాడనేది ఆసక్తికరంగా మారింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.