
ఇంటర్నెట్ డెస్క్: దిగ్గజ దర్శకుడు భారతీరాజా (Bharathiraja) పార్థివదేహానికి ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. అనారోగ్యం కారణంగా భారతీరాజా నేడు తుది శ్వాస విడిచారు. అభిమానుల సందర్శనార్థం ఆయన
పార్థివదేహాన్ని చెన్నైలోని నివాసంలో ఉంచారు. తమిళనాడు సీఎం విజయ్ (Vijay) అక్కడికి చేరుకొని నివాళులర్పించారు. భారతీరాజా కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన మృతి భారతీయ సినిమాకు తీరని లోటని సతాపం తెలిపారు.
డీఎంకే అధినేత స్టాలిన్, సినీ నటి రాధిక కూడా భారతీరాజా నివాసానికి చేరుకొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్టాలిన్ భారతీరాజాతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తమిళ సినిమా పంథాను మార్చి, కొత్త ధోరణిని సృష్టించిన గొప్ప కళాకారుడు భారతీరాజా మరణం తమిళ చిత్రసీమకు తీరని లోటన్నారు. స్టూడియోలకే పరిమితమైన కెమెరాలను గ్రామాల్లోకి తీసుకెళ్లి, గ్రామీణ ప్రజల జీవితాలను వెండితెరపై ఆవిష్కరించి తమిళ సినిమాను వాస్తవికతకు అద్దం పట్టేలా చేశారన్నారు. ఆయన చిత్రాలు భారతీయ చలనచిత్ర చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయని, ఆయన ఎన్నోతరాలకు స్ఫూర్తి అని గుర్తుచేసుకున్నారు.
భారతీరాజా మరణంపై తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి సంతాపం తెలిపారు. భారతీరాజా 4 దశాబ్దాల పాటు చలనచిత్రరంగంలో తనదైన ముద్ర వేశారని కొనియాడారు. దర్శకుడిగా, నటుడిగా భారతీరాజా విశేషఖ్యాతి గడించారని గుర్తుచేసుకున్నారు. వైవిధ్యమైన, సందేశాత్మక చిత్రాలను వివిధ భాషల్లో తెరకెక్కించారని అన్నారు. భారతీయ చలనచిత్రరంగానికి విశిష్ట సేవలందించారని తెలిపారు. ఆయన మరణం చిత్రరంగానికి తీరని లోటని విచారం వ్యక్తంచేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.