భారతీయ చలనచిత్ర రంగానికి పల్లెటూరి పచ్చదనాన్ని, వాస్తవికతను పరిచయం చేసిన దిగ్గజ దర్శకుడు, నటుడు భారతీరాజా (84) మరణంతో దక్షిణాది చిత్ర పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కొంతకాలంగా వృద్ధాప్య
, తీవ్ర శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. నాలుగు గోడల స్టూడియో సెట్లలో బందీగా ఉన్న తమిళ సినిమాను గ్రామీణ వాతావరణంలోకి నడిపించిన సృజనశీలి ఆయన. గత ఏడాది తన కుమారుడు మనోజ్ భారతీరాజా అకాల మరణం చెందడంతో ఆయన మానసికంగా తీవ్రంగా కుంగిపోయారు. ఆ పుత్రశోకం వల్లే ఆరోగ్యం మరింత బలహీనపడింది. 1977లో '16 వయాతినిలే' చిత్రంతో కెరీర్ ప్రారంభించిన ఆయన, దానిని తెలుగులో ‘పదహారేళ్ళ వయసు’గా రీమేక్ చేసి సంచలనం సృష్టించారు. ఆ తర్వాత ఆయన అందించిన ‘సీతాకోకచిలుక’ తెలుగు సినీ చరిత్రలో క్లాసిక్‌గా నిలిచింది. భారతీరాజా మరణంతో చిత్ర ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్నివ్యక్తం చేస్తున్నారు. * ముద్దుబిడ్డను కోల్పోయిన సినీ కళామతల్లి.. దిగ్గజ దర్శకుడు భారతీరాజా కన్నుమూత భారతీరాజా మరణంపై పవర్‌స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ‘ ప్రముఖ దిగ్గజ సినీ దర్శకుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత భారతీరాజా మరణం భారతీయ చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు. తన అసాధారణ చిత్రాలతో ఆయన తమిళ ప్రేక్షకులనే కాకుండా తెలుగు, హిందీ, కన్నడ భాషల ప్రేక్షకుల హృదయాలను కూడా గెలుచుకున్నారు. ఆరు జాతీయ పురస్కారాలు అందుకుని భారతీయ సినీ చరిత్రలో తనదైన ముద్ర వేశారు. మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కించిన భక్తిరస చిత్రం ‘ఆరాధన’, అలాగే జాతీయ పురస్కారం అందుకున్న ‘సీతాకోకచిలుక’ వంటి చిత్రాలు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. గ్రామీణ జీవన విధానాన్ని, మానవ సంబంధాలను అద్భుతంగా వెండితెరపై ఆవిష్కరించిన దర్శకుడిగా భారతీరాజా ఎప్పటికీ గుర్తుండిపోతారు. ఇలాంటి గొప్ప సృజనాత్మక దర్శకుడిని కోల్పోవడం భారతీయ సినీ పరిశ్రమకు పూడ్చలేని నష్టం. భారతీరాజా మరణంపై ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను.‘ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.* రషెస్‌పై అసంతృప్తి, డైరెక్టర్-హీరో మధ్య క్లాష్... ‘కార్తి 30’ ప్రాజెక్ట్ ఆగిపోయిందా? భారతీయ సినిమా తన గొప్ప కథా మాంత్రికుల్లో ఒకరిని కోల్పోయింది. పల్లె మట్టి పరిమళాన్ని, మానవ సంబంధాల అందాన్ని, ప్రేమలోని అమాయకత్వాన్ని, సాధారణ మనుషుల భావోద్వేగాలను శాశ్వతమైన సినీ కవిత్వంగా మలిచిన మహానుభావుడు ఆయన. ఆయన చిత్రాలు కోట్లాది మంది హృదయాలను తాకడమే కాకుండా, తరతరాల సినీ దర్శకులకు స్ఫూర్తిగా నిలిచాయి. పద్మశ్రీ పురస్కారం, పలు జాతీయ చలనచిత్ర అవార్డులు అందుకున్న భారతీరాజా సేవలు భారతీయ సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ‘ఆరాధన’ చిత్రంలో పులిరాజు పాత్రలో ఆయన దర్శకత్వంలో పనిచేసే అదృష్టం నాకు దక్కింది. సినిమాపై ఆయనకున్న అపారమైన అభిరుచి, సరళత, తన కళ పట్ల అంకితభావం నాపై చెరగని ముద్ర వేశాయి. ఈరోజు ఆయన మన మధ్య లేకపోయినా, ఆయన సృష్టించిన అద్భుత చిత్రాల ద్వారా ఆయన వారసత్వం శాశ్వతంగా జీవిస్తుంది. ‘ఇయక్కునర్ ఇమయం’ భారతీరాజా గారికి శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి.’ అంటూ మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్‌గా ట్వీట్ చేశారు.