
ఇంటర్నెట్ డెస్క్: తమిళ దిగ్గజ దర్శకుడు భారతీరాజా (Bharathiraja) నేడు తుదిశ్వాస విడిచారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు రూపొందించిన ఆయన మృతి పరిశ్రమకు తీరని లోటు అంటూ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు
. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.
‘‘ప్రముఖ దర్శకులు భారతీరాజా కన్నుమూశారని తెలిసి చింతించాను (Bharathiraja Passed Away). ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. తమిళ, తెలుగు చిత్రాలపై భారతీరాజా తనదైన ముద్ర వేశారు. గ్రామీణ నేపథ్యం, పల్లె ప్రజల జీవనం, ప్రేమానుబంధాలను చూపించడంలో ఆయన శైలి ప్రత్యేకమైనది. తెలుగులో దర్శకత్వం వహించిన ‘సీతాకోకచిలుక’ ఇప్పటికీ ఎవర్గ్రీన్. ఆ చిత్రంలోని పాటలు, సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పించాయి. అన్నయ్య చిరంజీవితో ‘ఆరాధన’ చిత్రం రూపొందించారు. అందులో ‘అరె ఏమైంది...’ అనే పాట ఎంతో ప్రాచుర్యం పొందింది. సున్నితమైన ప్రేమ, సెంటిమెంట్ కథలే కాకుండా ‘ఎర్ర గులాబీలు’, ‘టిక్ టిక్ టిక్’ లాంటి థ్రిల్లర్స్ తోను ప్రేక్షకులను మెప్పించారు. భారతీరాజా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను’’ - పవన్ కల్యాణ్ (Pawan Kalyan)
‘‘మనందరికీ ఎంతో ఇష్టమైన దర్శకుడు భారతీరాజా ఇక మన మధ్య లేరని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. ఆయన మరణం తమిళ చిత్రసీమకు తీరని లోటు. ఆయన సినిమాలు ఒక బెంచ్‌మార్క్‌గా నిలిచాయి. భవిష్యత్తులో రానున్న సినిమాలకు ఆయన చిత్రాలు ఓ నిఘంటువులా ఉంటాయి. ప్రతి సినిమా ప్రేమికుడి కోసం ఆయన ఒక గొప్ప వారసత్వాన్ని వదిలి వెళ్లారు. నన్ను రెండు జడలతో చూపిస్తూ ఒక సినిమా చేద్దామని ఆయన ఎప్పుడూ అనేవారు. ఆ కల ఇక తీరని కలగానే మిగిలిపోయింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా’’ - ఖుష్బూ
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.