
Netanyahu- Bibi | ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌తో దౌత్యపరమైన శాంతి ఒప్పందం కుదుర్చుకోవడానికి ఓ వైపు అమెరికా ప్రయత్నాలు చేస్తున్న వేళ.. లెబనాన్, బీరుట్లపై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడడం అగ్రరాజ్యానికి
కోపం తెప్పించింది. ఈ దాడుల వల్ల శాంతి చర్చలకు ఆటంకం కలుగుతోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘బీబీ, చాలా జాగ్రత్తగా ఉండాలి.. లేకపోతే నువ్వు ఒంటరిగా మిగిలిపోతావు’ అంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుని ఉద్దేశించి హెచ్చరించారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్ మళ్లీ దాడులకు దిగితే, అమెరికా నుంచి ఆశించిన సహకారం ఉండపోవచ్చని సంకేతమిచ్చారు. ఈ క్రమంలో నెతన్యాహుని ‘బీబీ’ అని సంబోధించడం ఆసక్తిగా మారింది. దీంతో నెతన్యాహుని బీబీ అని ఎందుకు సంబోధించారు? అంటూ నెటిజన్లు తెగ ఆరా తీస్తున్నారు.
బెంజమిన్ నెతన్యాహు 1949లో జన్మించారు. చిన్నతనం నుంచే ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు ముద్దుగా బీబీ అని పిలుచుకునేవారు. చిన్నప్పటి నుంచి అందరూ అలా పిలవడంతో ఆ పేరు స్థిరపడిపోయింది. ఇజ్రాయెల్‌లో ఎంతటి పెద్ద నాయకులకైనా, ప్రముఖులకైనా చిన్ననాటి ముద్దుపేర్లను అధికారికంగా, రాజకీయాల్లో కూడా వాడడం సాధారణం. పైగా హీబ్రూ భాషలో పేర్లను చిన్నవిగా చేయడానికి, ప్రేమగా పిలవడానికి ఒకే అక్షరాన్ని రెండుసార్లు పలకడం, చివర్లో ఐ (i)ని చేర్చడం ఒక అలవాటు. అలా బెంజమిన్లో ‘బి’ కాస్తా బీబీగా మారింది. నెతన్యాహు ప్రధాని అయ్యాక కూడా స్థానిక పత్రికలు, టీవీలు, ప్రజలు ఆయనను ‘బీబీ’ అని సంబోధించడం విశేషం.
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పూర్తి పేరు వెనుకా ఆసక్తికర కథ దాగుంది. వాస్తవానికి బెంజమిన్ కుటుంబం పేరు మిలీకోవ్స్కీ (Mileikowsky). తాత నాథన్ మిలీకోవ్స్కీ పోలాండ్ నుంచి తన కుటుంబంతో కలిసి అప్పటి పాలస్తీనా (ప్రస్తుత ఇజ్రాయెల్) ప్రాంతానికి వలస వచ్చారు. అలా వచ్చిన యూదులు తమ యూరోపియన్ పేర్లను పక్కన పెట్టి, తమ సంస్కృతికి అద్దం పట్టేలా హీబ్రూ పేర్లను మార్చుకునేవారు. ఈ క్రమంలోనే నాథన్ మిలీకోవ్స్కీ తన వ్యాసాలు రాయడానికి నెతన్యాహు అనే కలం పేరు ఎంచుకున్నారు. తర్వాతి కాలంలో అదే వారి కుటుంబం పేరుగా మారింది. అంతేకాదు నెతన్యాహు అంటే హీబ్రూ భాషలో ‘దేవుడు ఇచ్చిన కానుక’ లేదా ‘భగవంతుడి ప్రసాదం’ అని అర్థం. ఇక బెంజమిన్ అనేది బైబిల్ (పాత నిబంధన) ప్రకారం.. జాకోబ్ 12వ, చివరి కుమారుడి పేరు. అలా బెంజమిన్ నెతన్యాహు అయ్యారు. బెంజమిన్ తండ్రి బెంజియన్ మైలెకోవ్స్కీ కూడా తన పేరును బెంజియన్ నెతన్యాహుగా మార్చుకున్నారు. ఇజ్రాయెల్ ఆవిర్భావానికి కృషి చేసిన నేతల్లో ఈయన ఒకరు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.