విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో సోమవారం జరిగిన ప్రమాదం పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ప్రమాదం నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖలో పర్యటించారు. ఘటనాస్థలిని పరిశీలించారు. అనంతరం మీడియాతో
మాట్లాడిన పవన్ కళ్యాణ్.. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి కార్మికుని కుటుంబానికి రూ. 25 లక్షల చొప్పున తక్షణ పరిహారంతోపాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్లాంట్‌లో ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించారు. తీవ్రంగా గాయపడి ఆసుప్రతిలో చికిత్స పొందుతున్న వారికి రూ.10 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని తెలిపారు. పర్మినెంట్ ఉద్యోగులకు ఉద్యోగ విరమణ ప్రయోజనాల కింద రూ. 1.72 కోట్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు రూ. 45.75 లక్షలు అందిస్తామని, గాయపడినవారి వైద్యానికి అయ్యే మొత్తం ఖర్చులను స్టీల్ ప్లాంట్ యాజమాన్యమే పూర్తిగా భరిస్తుందన్నారు.విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రమాద ఘటనపై బొకారో స్టీల్ ప్లాంటుకు చెందిన త్రిసభ్య కమిటీ దర్యాప్తు చేస్తుందని, కమిటీ అందించే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగేలా చూస్తామన్న పవన్ కళ్యాణ్.. మరణించిన కార్మికుల పిల్లల చదువులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ప్రమాదంలో మరణించిన ఉద్యోగికి పదవీ విరమణ వయసు వరకూ, వారి కుటుంబ సభ్యులు ప్రస్తుతం ఉంటున్న స్టీల్ ప్లాంట్ క్వార్టర్లలోనే ఉచితంగా ఉండొచ్చని తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ఇక ఘటన స్థలంలో కార్మికులతో మాట్లాడానన్న పవన్ కళ్యాణ్.. సరైన భద్రతా ప్రమాణాలు పాటించలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిపారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ఆధునీకరించడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహించిందని, దశాబ్దాల నాటి పాత పరికరాలు, యంత్రాలను మార్చకుండా వాడటం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మికులు ఆరోపిస్తున్నారని వెల్లడించారు. గత 36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో చిన్నపాటి లీకేజీలు, ఇతర ప్రమాదాలు జరిగినప్పటికీ, ల్యాడిల్ బకెట్ పేలిపోవడం ఇదే మొదటిసారని అన్నారు. ఈ రకమైన పేలుడు అత్యంత అరుదైనదన్న డిప్యూటీ సీఎం.. త్రిసభ్య కమిటీ ప్రమాదం జరిగిన స్టీల్ మెల్టింగ్ షాప్ విభాగాన్ని పరిశీలిస్తుందన్నారు. ద్రవ ఉక్కును తరలించే లాడెల్ బకెట్ స్లైడ్ గేట్ తెరవకముందే పేలుడు ఎందుకు సంభవించింది? ఇది సాంకేతిక లోపమా? ఇంకేదైనా సమస్య? ఇలా అన్ని కోణాల్లో కమిటీ దర్యాప్తు జరుపుతుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అలాగే విశాఖ స్టీల్‌ప్లాంట్ కార్మికుల సమస్యలు, యాజమాన్య లోపాలు వంటి అంశాలపై త్వరలోనే కార్మిక సంఘాల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు. స్టీల్ ప్లాంటులో ఏం జరుగుతుందో క్షేత్రస్థాయిలో పనిచేసే కార్మిక సంఘాల నేతలతో మాట్లాడి తెలుసుకుంటానని వెల్లడించారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలో కొనసాగించాలనేదే కూటమి ప్రభుత్వం ఆకాంక్ష అని చెప్పిన పవన్ కళ్యాణ్.. కార్మిక సంఘాలు రాజకీయాలకు అతీతంగా పని చేసినప్పుడే కార్మికులకు నిజమైన న్యాయం జరుగుతుందని అన్నారు.