
తన ప్రతిభతో టీమ్ఇండియా తలుపు తట్టాడు అంది వచ్చిన అవకాశాన్ని అద్భుతంగా ఒడిసి పట్టాడు అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టాడు వేళ్లతో బంతిని గింగిరాలు తిప్పుతూ.. జట్టులో వేళ్లూనుకునే ప్రయత్నం చేశాడు! తొలి
ఇన్నింగ్స్‌లో బంతితో ‘ఆరేశాడు’! బ్యాటింగ్‌లోనూ రెండు సిక్స్‌లు బాదాడు అతడే సూపర్ బౌలర్ మానవ్ సుతార్..!
ప్రస్తుతం టీమ్ఇండియాలో చోటు కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. ఇలాంటి వేళ తనకు వచ్చిన అవకాశాన్ని ఈ ఎడమ చేతి వాటం స్పిన్ బౌలర్.. మానవ్ సుతార్ సద్వినియోగం చేసుకున్నాడు. ముల్లాన్ పూర్ వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్ తొలి ‘విన్నింగ్స్’లో సుతార్.. ఆరు వికెట్ల ప్రదర్శన చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ తీసుకున్నాడు. డెబ్యూ మ్యాచ్‌లోనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్‌ను సొంతం చేసుకుని సత్తా చాటాడు.
తొలి ఇన్నింగ్స్‌లో 22 ఓవర్లు బౌలింగ్ వేసి 33 పరుగులిచ్చి 6 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇందులో ఏకంగా 10 మెయిడిన్ ఓవర్లున్నాయి. అలాగే రెండో ఇన్నింగ్స్‌లో 10 ఓవర్లు బౌలింగ్ వేసి 29 పరుగులిచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ స్పెల్‌లో 2 మెయిడిన్ ఓవర్లున్నాయి. మొత్తంగా 32 ఓవర్లు బౌలింగ్ వేస్తే.. అందులో 12 ఓవర్లు మెయిడిన్లే. అలాగే బ్యాటింగ్‌లోనూ (28) ఫర్వాలేదనిపించాడు. రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లు బాది.. తనలో బ్యాటింగ్ నైపుణ్యమూ ఉందని చాటాడు.
రాజస్థాన్‌లోని గంగానగర్‌కు చెందిన మానవ్ సుతార్ 2022-23 రంజీ సీజన్లో ఆరు మ్యాచుల్లో ఏకంగా 39 వికెట్లు కైవసం చేసుకున్నాడు. ఈ ప్రదర్శనతో అతడు తొలిసారి సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. సుతార్.. ఇప్పటి వరకు 120 ఫస్ట్ క్లాస్ వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
సుతార్ ఐపీఎల్లో 2024లో అరంగేట్రం చేశాడు. ఆ సీజన్లో అతడు ఒకే ఒక మ్యాచ్ ఆడాడు. 2025 మెగావేలంలో అతడిని గుజరాత్ టైటాన్స్ రూ.30 లక్షలకు సొంతం చేసుకుంది. 2026 సీజన్లో అతడు నాలుగు మ్యాచ్‌లు ఆడి, రెండు వికెట్లు తీసుకున్నాడు.
మానవ్ సుతార్ భారత సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించడానికి ముందే.. అతడి ప్రతిభను ‘ది గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా’గా ప్రసిద్ధి చెందిన.. టీమ్ఇండియా దిగ్గజం రాహుల్ ద్రవిడ్ కొన్నేళ్ల క్రితమే గుర్తించారు. సుతార్‌లో ఆల్‌రౌండర్ సామర్థ్యాలున్నాయి. కానీ.. క్రికెట్ కెరీర్లో ఎక్కువ కాలం కొనసాగాలంటే బౌలింగ్ మీద దృష్టి పెట్టమని ద్రవిడ్.. సుతార్‌కు సలహా ఇచ్చారు. ఈ విషయాన్ని మానవ్ సుతార్ కోచ్ ధీరజ్ శర్మ వెల్లడించాడు.
అలా మొత్తానికి రాహుల్ ద్రవిడ్ నమ్మకాన్ని మానవ్ సుతార్ వమ్ము చేయలేదు. అతడి సూచనను పాటిస్తూ.. బౌలింగ్‌లో తనను తాను మెరుగుపరుచుకుంటూ.. అరంగేట్ర మ్యాచ్‌లోనే మెరుపులు మెరిపించాడు. అతడు భవిష్యత్తులోనూ నిలకడగా రాణిస్తూ టీమ్ఇండియాకు కీలక బౌలర్‌గా ఎదగాలని అభిమానులు కోరుకుంటున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.