
Hardeep Singh Puri | ఇంటర్నెట్ డెస్క్: దేశంలో ఇంధన నిల్వలకు ఢోకా లేదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి వెల్లడించారు. హర్మూజ్ జలసంధి మరోనెల రోజుల పాటు మూతపడి ఇంధన సరఫరాకు అవరోధం
ఏర్పడినా 30 నుంచి 60 రోజుల పాటు ఆ షాక్‌ను భారత్ తట్టుకోగలదని, ఆ మేర ఇంధన నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు. సీఎన్ఎన్-న్యూస్ 18కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు ఆయన మాట్లాడారు.
వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు, రిఫైనరీ ఇన్వెంటరీలు, కమర్షియల్ స్టాక్స్‌తో కలిపి దేశంలో ప్రస్తుతం 76-80 రోజులకు సరిపోయే ఇంధన నిల్వలు ఉన్నాయని పురి అన్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా హర్మూజ్ జలసంధి ద్వారా చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడినా, భారతదేశం సులువుగా తట్టుకోగలదని పేర్కొన్నారు. గల్ఫ్ వెలుపల ఉన్న ఇతర చమురు ఉత్పాదక దేశాల నుంచి సరఫరాను పెంచడం, అలాగే మొజాంబిక్ నుంచి అదనపు గ్యాస్ సరఫరాను అందుకోవడం ద్వారా భారత్ తన ఇంధన భద్రతను మరింత బలోపేతం చేసుకుంటోందని హర్దీప్ సింగ్ పురి వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో అదనపు ఎల్పీజీ కార్గోలను సరఫరా చేయడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి కీలక భాగస్వామ్య దేశాలు సిద్ధంగా ఉన్నాయని ఆయన వెల్లడించారు.
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఎక్కువ కాలం పాటు గరిష్ఠ స్థాయిలో కొనసాగే అవకాశం లేదని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచ మార్కెట్లో అస్థిరత ఉన్న సమయంలో దేశీయంగా రిఫైనింగ్ సామర్థ్యాన్ని భారత్ నిరంతరం విస్తరిస్తోందని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం 24 రిఫైనరీలను నిర్వహిస్తున్నామని వెల్లడించారు. చమురు ధరలు కనిష్ఠ స్థాయికి చేరినప్పుడు దాన్ని వినియోగించుకోవడంలో భారత్ విఫలమైందంటూ కొందరు చేస్తున్న విమర్శలపైన మంత్రి స్పందించారు. ముడిచమురును శాశ్వతంగా నిల్వ చేయలేమని, ఎప్పటికప్పుడు వాణిజ్య అవసరాల కోసం వినియోగిస్తూ.. దాన్ని తిరిగి భర్తీ చేస్తుండాలని చెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.