
ఇంటర్నెట్ డెస్క్: ‘పెద్ది’ మీద తాను ప్రాణం పెట్టుకున్నట్లు జగపతిబాబు చెప్పారు. మధ్యలో ఎన్ని సినిమాలు చేసినప్పటికీ తాను మాత్రం ‘పెద్ది’ (Peddi) విడుదల కోసమే ఎదురుచూసినట్లు తెలిపారు. రూ.300 కోట్లు
పెట్టి సినిమా తీసినా.. రూ.300 పెట్టి చూసే ఆడియన్స్ చేతుల్లోనే ఇండస్ట్రీ తలరాత ఉంటుందని అన్నారు. ‘పెద్ది’ విడుదల అనంతరం ‘అప్పలసూరి’ పాత్ర గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
‘‘పెద్ది’ విడుదలయ్యాక నాకు ఓ పెద్ద డైరెక్టర్ ఫోన్ చేశారు. ‘‘పెద్ది’లో మీరు చాలా గొప్ప పాత్ర చేసినా ఎందుకు ఎవరూ గుర్తించట్లేదు. అదే పాత్రను వేరే భాషకు చెందిన నటులు చేసి ఉంటే బాగా హైలైట్ చేసేవారు. వాళ్లకు 20 సినిమాలు ఆఫర్ చేసేవారు. మిమ్మల్ని ఎవరూ పట్టించుకోవట్లేదు ఏంటి?’ అని అన్నారు. ఏ ఇండస్ట్రీలో అయినా పరభాష నటులకు ఎక్కువ గౌరవం ఇస్తారు. నేను కన్నడలో చేస్తే అక్కడ బాగా గౌరవిస్తారు. నేను కూడా ‘పెద్ది’ విడుదలయ్యాక బుచ్చిబాబును ఒకటే ప్రశ్న అడిగా.. షూటింగ్ అప్పుడు.. ప్రతి షాట్‌కు క్లాప్స్ కొట్టారు. ఇప్పుడెందుకు నా గురించి మాట్లాడట్లేదు. నన్ను మర్చిపోతున్నారా అని అడిగాను. పెద్ది సినిమా కోసం నేను ప్రాణం పెట్టాను. అందుకే గుర్తింపు కోసం అడిగే హక్కు నాకు ఉంది. మిగతా సినిమాలకు నేను ఎప్పుడూ ఇలా అడగలేదు. ‘పెద్ది’ ఇంకా ఆదరణ దక్కాల్సిన చిత్రం. కచ్చితంగా ఆదరణ దక్కుతుంది. ఇందులో పనిచేసిన ప్రతిఒక్కరూ దీన్ని చూసి గర్వంగా ఫీల్ అవుతారు’’ అని జగపతి బాబు (Jagapathi Babu) చెప్పారు.
ఇక జాన్వీ (Janhvi Kapoor) పాత్ర గురించి మాట్లాడుతూ.. ‘‘సినిమా విషయంలో ఆర్టిస్టులను ట్రోల్ చేయొద్దు. పాపం ఆ అమ్మాయి దర్శకుడు చెప్పినట్లు చేసింది. కొన్నిసార్లు అది మిస్ ఫైర్ అవుతుంది. ఈ విషయంలో నేను జాన్వీకపూర్‌కు సపోర్ట్ చేస్తాను. తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేయొద్దు. ట్రోల్ చేసి మానసికంగా ఇబ్బంది పెట్టొద్దు’’ అని అన్నారు. రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ‘పెద్ది’ మూడు రోజుల్లో రూ.236 కోట్లు వసూలు చేసింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.