
చిన్నతనంలో అంతరిక్షమన్నా, దానికి సంబంధించిన విషయాలన్నా ఎంతో బోర్‌గా ఫీలయ్యేదామె. కానీ ఓ సదస్సుకు హాజరైన తర్వాత కెరీర్ అంటూ నిర్మించుకుంటే అది అంతరిక్ష రంగంలోనే అన్నంతగా స్ఫూర్తి పొందింది. ఆ పట్టుదలే గ్వెన్ షాట్‌వెల్‌ను స్పేస్ఎక్స్ అధ్యక్షురాలిగా, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా నిలబెట్టాయి. చిన్నతనంలో అంతరిక్షమన్నా, దానికి సంబంధించిన విషయాలన్నా ఎంతో బోర్‌గా ఫీలయ్యేదామె. కానీ ఓ సదస్సుకు హాజరైన తర్వాత కెరీర్ అంటూ నిర్మించుకుంటే అది అంతరిక్ష రంగంలోనే అన్నంతగా స్ఫూర్తి పొందింది. ఆ పట్టుదలే గ్వెన్ షాట్‌వెల్‌ను స్పేస్ఎక్స్ అధ్యక్షురాలిగా, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా నిలబెట్టాయి. తాజాగా ఈ అంతరిక్ష పరిశోధన సంస్థ ఐపీఓ అమెరికా స్టాక్ మార్కెట్లలో రికార్డు స్థాయిలో విజయవంతంగా లిస్ట్ అయింది. ఫలితంగా ఈ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్ (లక్ష కోట్ల డాలర్ల/సుమారు రూ. 95 లక్షల కోట్లకు పైగా సంపద కలిగిన వ్యక్తి)గా అవతరించారు. ఇలా కంపెనీ విలువ అమాంతం పెరగడంలో షాట్వెల్దే కీలక పాత్ర అని చెప్పచ్చు. ఎందుకంటే మస్క్ విజన్‌కు.. ఆమె వ్యూహాత్మక ప్రణాళికలు, కీలక నిర్ణయాలు, వ్యాపార ఒప్పందాలు తోడవడం వల్లే నేడు సంస్థ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిందనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే షాట్వెల్ పేరు ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. తెలిసీ తెలియని వయసులో వద్దనుకున్న కెరీరే పెద్దయ్యాక ఎంచుకోవడం కొంతమంది విషయంలో చూస్తుంటాం. షాట్వెల్ జీవితమూ ఇందుకు మినహాయింపు కాదు. ఇల్లినాయిస్లోని ఎవాన్స్టోన్ అనే ప్రాంతంలో పుట్టిపెరిగిన ఆమెది ఉన్నత విద్యావంతుల కుటుంబం. తల్లిదండ్రుల స్ఫూర్తితోనే తానూ ఉన్నత విద్యనభ్యసించాలని, కెరీర్లో అత్యుత్తమ స్థాయిలో స్థిరపడాలని అనుకుంది. అయితే ఐదేళ్ల వయసులో తన కుటుంబ సభ్యులతో కలిసి అపోలో మిషన్స్‌కు సంబంధించిన ఓ టీవీ సిరీస్ చూసింది. ‘అప్పుడు నాకు అది అంత ఆసక్తిగా అనిపించలేదు.. పైగా అది చూస్తున్నంత సేపు బోర్‌గా ఫీలయ్యా. అంతరిక్ష రంగంపై మక్కువ, అవగాహన కూడా
అప్పుడు నాకు లేవు. కానీ హైస్కూల్ విద్యనభ్యసిస్తు్న్న సమయంలో మా అమ్మ నన్ను ‘ఇల్లినాయిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’లో జరిగిన ‘సొసైటీ ఆఫ్ విమెన్ ఇంజినీర్స్’ అనే సదస్సుకు తీసుకెళ్లింది. అందులో ఓ మెకానికల్ ఇంజినీర్ ఇచ్చిన స్ఫూర్తిదాయక ప్రసంగం నన్ను టెక్ కెరీర్ దిశగా ప్రేరేపించింది. ఈ క్రమంలోనే మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తిచేసిన నేను.. ఆపై అప్లైడ్ మ్యాథమేటిక్స్‌లో పీజీ పట్టా అందుకున్నా..’ అంటోన్న షాట్వెల్.. చిన్నతనం నుంచి చదువులో టాపర్‌గా, ఆటల్లో మేటిగా రాణించారు.
చదువు పూర్తయ్యాక ఉద్యోగ వేట ప్రారంభించిన షాట్వెల్కు తొలుత తాను ఇష్టపడిన అంతరిక్ష రంగంలో జాబ్ దొరకలేదు. దాంతో ఓ ఆటోమోటివ్ సంస్థలో చేరారు. అయినా కెరీర్లో అనుభవం ముఖ్యమని భావించిన ఆమె.. ఆ ఉద్యోగంలో కొన్నేళ్ల పాటు కొనసాగారు. ఆ తర్వాత తాను కలలు కన్న అంతరిక్ష రంగంలోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలోనే ఆయా అంతరిక్ష సంస్థల్లో పనిచేస్తూ.. వాటి కీలక ఒప్పందాల్లో భాగమయ్యారు. అయితే ఎక్కువ అనుభవం గడించిన ఉద్యోగులు.. టాప్ కంపెనీల్లోకి మారాలనుకోవడం సహజం. కానీ షాట్వెల్ మాత్రం 2002లో అదే ఏడాది మస్క్ ప్రారంభించిన ‘స్పేస్ఎక్స్’లో చేరారు. ఇది అనుకోకుండా వచ్చిన అవకాశం అంటూ ఓ సందర్భంలో పంచుకున్నారామె.
‘అప్పుడప్పుడే స్పేస్ఎక్స్లో చేరిన నా మాజీ సహోద్యోగి ద్వారా మస్క్ నాకు పరిచయమయ్యారు. ఇలా మాటల మధ్యలోనే తన సంస్థ వ్యాపారాభివృద్ధి కోసం నిబద్ధతతో పనిచేసే ఓ ఉద్యోగిని నియమించుకోమని ఆయనతో చెప్పా. అందుకు ఆయన.. ‘ఎవరో ఎందుకు.. మీరే చేయచ్చుగా?’ అన్నారు. అయితే ఆ సమయంలో నేను ఇందుకు సిద్ధంగా లేను. బాగా ఆలోచించి రెండు వారాల తర్వాత సరే అన్నా. అలా అనుకోకుండా స్పేస్ఎక్స్లో పనిచేసే అవకాశం వచ్చింది..’ అంటోన్న షాట్వెల్.. ఈ సంస్థలో 11వ ఉద్యోగిగా చేరారు. అప్పట్నుంచి ఇప్పటిదాకా మస్క్ ఆలోచనలకు కార్యరూపమిస్తూ సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు షాట్వెల్.
వాణిజ్య అంతరిక్ష రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చే లక్ష్యంతో మస్క్ ప్రారంభించిన స్పేస్ఎక్స్ తొలినాళ్లలో పలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. ఆయా సాంకేతిక సమస్యలు, వరుస రాకెట్ వైఫల్యాలతో ఒకానొక సమయంలో మూతపడే స్థితికి చేరుకుంది. ఈ సమయంలోనే షాట్వెల్ తనదైన వ్యాపార వ్యూహాలతో సంస్థ అభివృద్ధికి బీజం వేశారు. వరుసగా మూడు రాకెట్ ప్రయోగాలు విఫలమైనా.. నాలుగోసారి విజయవంతంగా ‘ఫాల్కన్-1’ను నింగిలోకి పంపించడంలో ప్రధాన భూమిక పోషించారామె. ఓ ప్రైవేట్ అంతరిక్ష సంస్థ అభివృద్ధి చేసిన, పూర్తి ద్రవ ఇంధనంతో నడిచే రాకెట్ ఇలా భూ కక్ష్యను విజయవంతంగా దాటడం అదే తొలిసారి. దీంతో ఈ ప్రయోగానికి నాయకత్వం వహించిన షాట్వెల్ పేరు అప్పట్లో మార్మోగింది. ఆపై అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సరుకు రవాణా చేసేందుకు స్పేస్ఎక్స్ నాసాతో 1.6 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం వెనుకా షాట్వెల్దే కీలక పాత్ర. అందుకే ఆమెను మస్క్ ఈ సంస్థకు అధ్యక్షురాలిగా, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా నియమించారు. నిజానికి ఈ ఒప్పందమే అటు ఆమె కెరీర్‌కు, ఇటు సంస్థ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కి విజయాల బాట పట్టేందుకు కీలకంగా మారిందని చెప్పచ్చు. ఇదొక్కటే కాదు.. నాసాతో స్పేస్ఎక్స్ మరిన్ని కీలక ఒప్పందాలు కుదుర్చుకోవడంలోనూ షాట్వెల్ కృషి చేశారు.
ప్రస్తుతం స్పేస్ఎక్స్కు నాయకురాలిగా షాట్వెల్ అత్యున్నత బాధ్యతలు నిర్వర్తిస్తున్నా.. క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఉద్యోగులతో మమేకమై పనిచేయడమే తనకు సంతృప్తినిస్తుందంటూ ఓ సందర్భంలో తన వృత్తి నిబద్ధతను బయటపెట్టారు. రాకెట్ల తయారీ, వాటి ప్రయోగం, రాకెట్ల పునర్వినియోగం; నాసాతో పాటు ఇతర ప్రైవేటు ఉపగ్రహ కంపెనీలతో కీలక ఒప్పందాలు కుదుర్చుకోవడం.. వాణిజ్య భాగస్వాములతో బలమైన సంబంధాలు కొనసాగించడం; ప్రపంచం నలుమూలలకూ హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవలందించేందుకు ‘స్టార్‌లింక్’ ప్రాజెక్ట్ విస్తరణ; మానవ సహిత చంద్రుడి, అంగారక యాత్రల్ని చేపట్టే లక్ష్యంతో ‘స్టార్‌షిప్’ మెగా రాకెట్ల తయారీ.. ఇలా అడుగడుగునా స్పేస్ఎక్స్ అభివృద్ధి కోసం మస్క్‌తో కలిసి పనిచేస్తున్నారామె. సుమారు 24 ఏళ్లుగా ఈ కంపెనీలో భాగమైన ఆమె.. తన వ్యాపార దక్షత, వ్యూహాత్మక ప్రణాళికలతో స్పేస్‌ఎక్స్‌ను ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన ప్రైవేటు అంతరిక్ష సంస్థగా తీర్చిదిద్దడంలో ముఖ్య భూమిక పోషించారు. తాజాగా ఈ సంస్థ ఐపీఓ.. అమెరికా స్టాక్ మార్కెట్లలో రికార్డు స్థాయిలో విజయవంతంగా లిస్ట్ అయింది. తద్వారా మస్క్ ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్ (లక్ష కోట్ల డాలర్ల/సుమారు రూ. 95 లక్షల కోట్లకు పైగా సంపద కలిగిన వ్యక్తి)గా అవతరించారు. ఈ సక్సెస్‌కు ప్రధాన కారణం కూడా షాట్వెల్ వృత్తి నిబద్ధతే అంటున్నారు విశ్లేషకులు.
ఇలా ఓ నాయకురాలిగానే కాకుండా.. టెడెక్స్ వంటి వేదికలపై ప్రసంగాలు కూడా ఇస్తుంటారు షాట్వెల్. ఈ క్రమంలో శాస్త్రసాంకేతిక రంగాల ప్రాధాన్యాన్ని వివరిస్తూ నేటి యువతను ఈ దిశగా ప్రోత్సహిస్తున్నారు. అంతరిక్ష రంగంలో ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా ఆయా అవార్డులు-రివార్డులు అందుకున్న ఆమె.. పలు ప్రముఖ పత్రికలు విడుదల చేసిన ‘అత్యంత శక్తిమంతమైన మహిళల’ జాబితాల్లోనూ చోటుదక్కించుకున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in
This website follows the DNPA Code of Ethics.