నాణేనికి రెండు పార్శ్వాలు ఉన్నట్లే.. ఏ ఘటనకైనా రెండు కోణాలు ఉంటాయి. ఓ కోణంలో మాత్రమే చూసి నిర్ణయం తీసుకోవడం పొరబాటే అవుతుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే.. శనివారం ఉదయం నుంచి సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. హైదరాబాద్‌లో రాంగ్ రూట్లో వచ్చిన ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ను.. ఓ సామాన్య బైకర్ నిలదీసిన వీడియో చక్కర్లు కొడుతోంది. పుష్పక్ బస్సును రాంగ్ రూట్లో తీసుకురావడంపై అభ్యంతరం చెప్తూ ఓ బైకర్.. తన బైకును బస్సుకు అడ్డంగా పెట్టి డ్రైవర్‌ను నిలదీసిన వీడియో నెటిజన్ల నుంచి ప్రశంసలు అందుకుంది. అయితే ఈ ఘటనలో ఓ ఇంట్రస్టింగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత.. ఆ ఆర్టీసీ బస్సుపై రూ.3 వేలకుపైగా పెండింగ్ చలాన్లు ఉన్నాయనే వార్తలు బయటకు వచ్చాయి. ఇప్పుడు ఇంకొక విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఇది ఆ బైక్ గురించి. ఆ బైక్ యజమానికి కూడా ఏమీ తక్కువ తినలేదని.. ఆ బైక్ మీద ఏకంగా రూ.6960 పెండింగ్ చలాన్లు ఉన్నట్లు తేలింది. బైక్ నంబర్ ఆధారంగా తెలంగాణ పోలీస్ ఇంటిగ్రేటెడ్ ఈ- చలాన్ సిస్టమ్ తనిఖీ చేస్తే బైక్ యజమాని కూడా సాంప్రదాయినీ.. సుద్దపూసనీ కాదని తేలింది. దీంతో ఉదయం నుంచి ప్రశంసలు అందుకున్న బైకర్.. ఇప్పుడు విమర్శలు ఎదుర్కొంటున్నారు.ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే.. ఆర్టీసీ బస్సు రాంగ్ రూట్లో వస్తోందని అడ్డుకున్న ఆ బైక్ మీద కూడా రాంగ్ రూట్ డ్రైవింగ్‌కు సంబంధించిన చలాన్ పెండింగ్‌లో ఉండటం విశేషం. హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం, పైలెట్ రైడర్ హెల్మెట్ పెట్టుకోకపోవటం, ఫ్రీ లెఫ్ట్‌కు ఆటంకం కలిగించటం, సెల్ ఫోన్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్ ఇలా అన్ని రకాల ట్రాఫిక్ ఉల్లంఘనలు కూడా ఈ బైక్ మీద ఉన్నాయి. 2023 నుంచి ఇప్పటి వరకూ మొత్తంగా 16
పెండింగ్ చలానాలు ఉండటం గమనార్హం. దీంతో ఎవరేమీ తక్కువ తినలేదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.