
‘‘గత పదేళ్లుగా నాకు నటనను మానేయాలని అనిపిస్తూనే ఉంది. కానీ సరిగ్గా ఆ సమయంలోనే ఏదో ఒక పాత్ర నా ఖాతాలో వచ్చి చేరుతుంద’’ని అంటున్నారు హిందీ నటుడు మనోజ్ బాజ్పేయీ. ‘గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్’
, ‘ఇన్స్పెక్టర్ జెండే’, ‘ది ఫ్యామిలీ మ్యాన్’ లాంటి ఎన్నో అలరించే కథల్లో నటించి అభిమానుల్ని సంపాదించుకున్నారీయన. వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన ఆయన... ‘గవర్నర్’ సినిమాతో తెరపైకి రావడానికి సన్నద్ధమవుతున్నారు. ఈ చిత్రం ఈ నెల 12న రాబోతుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మనోజ్.. తన సినీప్రయాణం గురించి కొన్ని ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు.
‘‘మీరు సంవత్సరాల తరబడి సీరియస్, మానసికంగా అలసిపోయే పాత్రలు పోషించినప్పుడు మీ స్వభావం చాలా చిరాకుగా మారుతుంది. మీ మూడ్ స్వింగ్స్ కూడా పెరుగుతాయి. దీని వల్లే నేను నటనను వది లేయాలని చాలాసార్లు అనుకున్నా. కానీ మళ్లీ మరో అవకాశంతో కెమెరా ముందు నిలబడాల్సి వస్తోంది. జీవనోపాధి కోసమో.. నా కుటుంబాన్ని పోషించాలనే బాధ్యతతోనో.. ఇలా కేవలం తప్పనిసరి పరిస్థితుల్లో నటించడం నాకిష్టం లేదు. ఏదైనా ఒక పాత్ర పోషిస్తే.. అది నాకు నిజంగా ఆనందాన్ని, సంతృప్తిని ఇస్తుందని అనిపించినప్పుడు మాత్రమే నేను నటించాలనుకుంటాను. నటనను డబ్బు, అవసరం కోసం కాకుండా.. అభిరుచితో చేయాలనుకుంటున్నా’’.
‘‘ఇప్పటి వరకు ఎన్నో చిత్రాల్లో చాలా గంభీరమైన పాత్రలు చేశాను. అవన్నీ నా మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపాయి. ఇలాంటి పాత్రలు పోషించడం అంత సులభం కాదు. నేను మానసికంగా, శారీరకంగా వాటిలో పూర్తిగా లీనమైపోయేవాణ్ని. కానీ ఇప్పుడు నేను ఈ వలయం నుంచి బయటపడాలనుకుంటున్నా. తేలికపాటి.. కమర్షియల్ సినిమాలు చేయాలనుకుంటున్నా. అందులో ఎలాంటి సన్నాహాలు ఉండవు. కేవలం పాటలు, డ్యాన్స్, వినోదం మాత్రమే ఉంటాయి. పూర్తిస్థాయి కామెడీ చిత్రంలో కూడా నటించాలని కోరుకుంటున్నా. ఇలాంటి కథల్లో భాగమైతే.. ఇంట్లో ఎలాంటి సన్నాహాలు చేసుకోకుండా సెట్‌కు రావచ్చు. మీరు ఏ పాత్ర చేస్తున్నారో కూడా ఆలోచించకుండా సెట్లో సరదాగా గడపచ్చు. నేను ఇన్నాళ్లుగా చేస్తున్న పనులన్నింటి నుంచి ఇదే నాకు విముక్తి’’.
‘‘నా సినీప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాను. నా కష్టానికి ఫలితాన్ని కూడా పొందాను. కానీ దాని కోసం భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. సినిమాలతో బిజీగా గడపడం వల్ల నా తల్లిదండ్రులకు తగినంత సమయం కేటాయించలేకపోయా. చదువు కోసం మా గ్రామం నుంచి బోర్డింగ్ పాఠశాలకు మారడం, ఆ తర్వాత కెరీర్ కోసం దిల్లీ, ముంబయిలలో నివసించడం వల్ల కుటుంబానికి నాకు మధ్య దూరం పెరిగింది. ఆ బాధ ఈ రోజుకీ నన్ను వెంటాడుతోంది. నా లక్ష్యం.. బంగ్లా, ఖరీదైన వాచీలు ధరించడం కాదు. నాకు నచ్చిన పాత్రలను ఎంచుకునే స్వేచ్ఛను కలిగి ఉండాలి. అదే నా కోరిక’’.
‘‘కెరీర్ ప్రారంభ రోజుల్లో ఎన్నో తిరస్కరణలను ఎదుర్కోవలసి వచ్చింది. అది నా జీవితంలోనే అత్యంత కష్టమైన సమయం. నేను నిజంగా బాగా నటించగలనా? ఇలా నాపై నాకే సందేహం రావడం మొదలైంది. ఆ సమయంలో డబ్బు సమస్య ఉండేది. నేను ఎప్పుడూ అనారోగ్యానికి గురయ్యేవాణ్ని. ఇలానే నేను సెట్‌కు వెళ్లినప్పుడు.. నన్ను తిట్టి బయటకు గెంటేసిన రోజులున్నాయి. నేను పరిశ్రమకు చెందిన వ్యక్తిని కాదు. కానీ ఎంతో పోరాటం, పట్టుదలతో చివరికి ఈరోజు నాకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నా’’.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.