ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జనసేన కమిటీలను రద్దు చేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని జనసేన నాయకులలో క్రమశిక్షణ లోపించడమే ఇందుకు
కారణమని జనసేన పార్టీ వెల్లడించింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని జనసేన నేతలు పార్టీ విదానాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని.. నేతల తీరుపై మద్దతుదారుల నుంచి తమకు ఫిర్యాదులు వస్తున్నాయని జనసేన పార్టీ వెల్లడించింది. జనసేన పార్టీ సిద్ధాంతాలు, విధానాలకు ఆకర్షితులమై, తోడుగా నిలిచామని.. కానీ జిల్లా నేతల వైఖరి అందుకు విరుద్ధంగా ఉందని జనసైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు జనసేన ఓ ప్రకటనలో తెలిపింది. నెల్లూరు జిల్లాలోని జనసేన నేతల మధ్యన విభేదాలు, వారి క్రమశిక్షణారహిత చర్యల కారణంగా జనసేన కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారని జనసేన పార్టీ తెలిపింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని జిల్లా, నగర, మండలం, గ్రామస్థాయి కమిటీలను అన్నింటినీ రద్దు చేస్తున్నట్లు జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటి నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని జనసేన స్పష్టం చేసింది. ఉమ్మడి నెల్లూరు జిల్లా సమన్వయ బాధ్యతలు చూస్తున్న నేతలతో పాటుగా, కమిటీలలోని ఇతర సభ్యులను కూడా వారికి నిర్దేశించిన బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు జనసేన స్పష్టం చేసింది. క్రమశిక్షణ లేకపోతే వ్యవస్థను సక్రమంగా నిర్వహించలేమని అభిప్రాయపడింది.ఇక కొన్ని రోజుల క్రితమే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని జనసేన కమిటీలను కూడా ఆ పార్టీ అధిష్టానం రద్దుచేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నెల్లూరు జిల్లా కమిటీలను కూడా రద్దు చేశారు. కొత్త కమిటీలను నియమించే వరకూ కేంద్ర కార్యాలయం నుంచి ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని జనసేన పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరు మీదుగా ఈ ప్రకటన విడుదలైంది. అయితే క్రమశిక్షణ లోపించిందనే కారణంతో కమిటీలను రద్దు చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రకాశం, నెల్లూరు జిల్లాల తర్వాత ఏ జిల్లాపై పవన్ కళ్యాణ్ ఫోకస్ చేస్తారో అనే చర్చ జరుగుతోంది.