
Viral post | ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా ఐటీ ఉద్యోగం అంటేనే రూ.లక్షల్లో జీతం.. విలాసవంతమైన జీవితం.. వారాంతాల్లో పార్టీలు.. సాధారణంగా ఇవే గుర్తొస్తాయి. కానీ, ఇదంతా నాణేనికి ఒకవైపే. ఎంత జీతం వచ్చినా
పెద్ద పెద్ద నగరాల్లో జీవన వ్యయం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో అదనపు ఆదాయం కోసం కొందరు అదనంగా పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేస్తున్నాయి. బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి కూడా వీకెండ్స్‌లో బైక్ డ్రైవర్ అవతారం ఎత్తాడు. దీనికి సంబంధించి ఓ వ్యక్తి చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.
బెంగళూరులోని బన్నెరఘట్టకు వెళ్లడానికి షాబాజ్ ఇటీవల బైక్ ట్యాక్సీ బుక్ చేసుకున్నాడు. ర్యాపిడో డ్రైవర్‌తో మాటలు కలపగా.. అతడు తొలుత కన్నడలో మాట్లాడాడు. అయితే, షాబాజ్‌కు కన్నడ రాకపోవడం గమనించి వెంటనే ఇంగ్లిష్‌లో సంభాషణను కొనసాగించాడు. ‘మీరేం చేస్తుంటారని షాబాజ్‌ని అడగ్గానే.. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ’ అంటూ సమాధానం ఇచ్చాడు. ‘మరి మీరు?’ అని అడగ్గానే.. ‘నేను కూడా’ అనే సమాధానం వచ్చింది. ‘ఎంఎన్సీలో సాఫ్ట్వేర్ డెవలపర్‌గా పనిచేస్తున్నా. ఆరెంకల జీతం. కానీ, వారం చివరిరోజుల్లో బైక్ ట్యాక్సీ నడుపుతా. నాకు పెళ్లయ్యింది. పిల్లలున్నారు. కుటుంబాన్ని పోషించాలంటే అదనపు ఆదాయం కావాలి కదా!’ అంటూ ఆ వ్యక్తి నుంచి సమాధానం వచ్చింది.
అతడి మాటలు తనను ఆలోచనలో పడేశాయంటూ షాబాజ్ ఎక్స్ వేదికగా చెప్పుకొచ్చాడు. ఇంత జీతం ఉంటూ ఇలా కష్టపడుతున్నారంటే.. బెంగళూరు వంటి నగరాల్లో జీవించడం ఎంత కష్టంగా మారిందో కదా!’ అంటూ పోస్ట్ పెట్టాడు. దీనిపై పలువురు నెటిజన్లు స్పందించారు. హైదరాబాద్ నగరంలోనూ చాలా మంది పరిస్థితి ఇదేనంటూ పేర్కొన్నారు. అదనపు ఆదాయం కోసం ఇలా బైక్ డ్రైవర్‌గా అవతారమెత్తే బదులు.. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం ద్వారా అధికాదాయం పొందొచ్చంటూ మరికొందరు సలహా ఇచ్చారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
కర్ణాటక సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar) ఆదివారం మెట్రోలో ప్రయాణించారు.