ఆంధ్రప్రదేశ్లో మరో మూడు రోజులు విభిన్న వాతావరణం కొనసాగుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఒకవైపు వర్షాలు, మరోవైపు తీవ్ర వేడిగాలులు వీస్తాయన్నారు. ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
పడతాయన్నారు. పోలవరం, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, మార్కాపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో మిగిలిన జిల్లాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్పారు. రాష్ట్రంలో ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించగానే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.అలాగే రాష్ట్రంలో తీవ్ర ఎండలు, వేడి గాలుల హెచ్చరికలు జారీ చేశారు. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 56 మండలాల్లో తీవ్ర వేడిగాలులు, 51 మండలాల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ జిల్లాల్లోని కొన్నిచోట్ల 42 డిగ్రీల నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అనకాపల్లి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో 40 డిగ్రీల నుంచి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని తెలిపారు.శుక్రవారం రోజు శ్రీకాకుళం జిల్లాలోని కొత్తూరు, హిరమండలం పాతపట్నం, పరిసర ప్రాంతాలలో గంటకు 60 కి.మీ అంతకంటే ఎక్కువ వేగంతో కూడిన బలమైన గాలులు వీస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మెరుపులు, పిడుగులతో కూడిన మోస్తరు వర్షంతో కురిసే అవకాశం ఉందని.. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మొత్తం మీద మరో మూడు రోజుల పాటూ ఓవైపు వర్షాలు, మరోవైపు ఎండలతో విచిత్రమైన వాతావరణం ఉంటుందని తెలిపారు. ఇదిలా ఉంటే.. నైరుతి రుతుపవనాలు మరో రెండు, మూడు రోజుల్లో రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ నెల 15 నాటికి రాష్ట్రమంతా విస్తరిస్తాయని భావిస్తున్నారు. ముందుగా రాయలసీమ, ఆ తర్వాత రాష్ట్రం మొత్తం రుతుపవనాలు విస్తారిస్తాయంటున్నారు.