
జడ్చర్ల: బీఆర్ఎస్ నేతలు పాదయాత్రలు కాదు.. పాలమూరు నుంచి కాశీ వరకు పొర్లుదండాలు పెట్టినా వారి పాపాలు తీరవని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) అన్నారు. ఆ పార్టీ చేసిన అన్యాయాన్ని ఉమ్మడి
మహబూబ్నగర్ జిల్లా ప్రజలు ఎన్నటికీ మరువరని చెప్పారు. జిల్లాలోని ప్రాజెక్టులను సీఎం రేవంత్ గురు, శుక్రవారాల్లో సందర్శించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం జడ్చర్ల మండలం గంగాపూర్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. 20 ఏళ్ల క్రితం ఈ జిల్లాలో నాటిన మొక్క.. తెలంగాణ సీఎంగా వృక్షమై నిలబడ్డాడని అన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ (KCR), బీఆర్ఎస్ (BRS) పాలనపై రేవంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘కరీంనగర్లో ఓడిపోతానేమోనని కేసీఆర్ పాలమూరుకు వచ్చారు. వలస వచ్చిన నేతను గుండెల్లో పెట్టుకుని చూసుకున్నాం. పాలమూరు నుంచి పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించుకున్నాం. ఐదేళ్లు ఎంపీగా ఉన్నా.. ఐదుసార్లు కూడా పాలమూరుకు ఆయన రాలేదు. మేకవన్నె పులి అని తెలియక కేసీఆర్ను ప్రజలు రెండుసార్లు గెలిపించారు. సమస్యల పరిష్కారంపై రైతులకు ఏనాడైనా భరోసా ఇచ్చారా? కేసీఆర్, ఆయన కుమారుడు, మనవడు రాజ్యాలు ఏలుతారట. వృత్తి పనులు చేసుకునేవారు ఏళ్ల తరబడి అలాగే ఉండాలట.
జిల్లాలోని ప్రాజెక్టులను బీఆర్ఎస్ నేతలు పట్టించుకోలేదు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.22వేల కోట్లలో రూ.8వేల కోట్లు పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులకే ఖర్చు చేశాం. ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలు తెచ్చుకున్నాం. 200 ఎకరాల్లో ఎడ్యుకేషన్ క్యాంపస్ ఏర్పాటు చేసుకున్నాం. వలసలు ఆగాలంటే పాలమూరు జిల్లా సస్యశ్యామలం కావాలి. రెండు పడకగదుల ఇళ్లు కట్టిన చోటే బీఆర్ఎస్ నేతలు ఓట్లడగాలి. ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన చోటే నేను ఓట్లడుగుతా. కాంగ్రెస్ 30 నెలల పాలన.. చెబితే రామాయణం, రాస్తే భారతం అవుతుంది. బీఆర్ఎస్ పదేళ్ల పాలన.. నా 30 నెలల పాలనపై చర్చకు సిద్ధమా?కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఇరువురి పాలనపై చర్చిద్దాం. ఆ చర్చలో ఓడితే నేను క్షమాపణ చెబుతా. పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ జెండా ఎగురనివ్వం. గద్దెలు దిగాలి.. దిమ్మెలు కూలాలి. పాలమూరు గడ్డపై ఇక బీఆర్ఎస్ గుర్తు మర్చిపోవాలి. మీ గుర్తు, మీ ఎమ్మెల్యే అనేది ఇక గతమే. ఆ పార్టీ నుంచి భవిష్యత్తులో ఒక్కరినీ గెలవనివ్వం’’అని రేవంత్ అన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
హైదరాబాద్లో చాలా భవనాలకు ఫైర్ ఎన్వోసీలు లేవని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.