
AP Tourism:ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగానికి కొత్త ఊపు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో బీచ్ షాక్స్ పాలసీకి
AP Tourism:ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగానికి కొత్త ఊపు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో బీచ్ షాక్స్ పాలసీకి ఆమోదం లభించింది. గోవా తరహాలో బీచ్ ప్రాంతాల్లో ప్రత్యేక షాక్స్ ఏర్పాటు చేసి, పరిమిత స్థాయిలో మద్యం విక్రయాలకు అనుమతివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పర్యాటకులను ఆకర్షించడం, తీరప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలను పెంచడం లక్ష్యంగా ఈ విధానాన్ని తీసుకొచ్చారు. గోవా, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను పరిశీలించిన తర్వాత ఏపీ ప్రభుత్వం ఈ పాలసీని రూపొందించింది.మొదటి దశలో విశాఖపట్నం, భీమిలి, శ్రీకాకుళం, చీరాల బీచ్‌లలో పైలట్ ప్రాజెక్టుగా బీచ్ షాక్స్ ఏర్పాటు చేయనున్నారు. ఈ షాక్స్ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే పనిచేయనున్నాయి. ఇందులో పరిమిత రకాల మద్యం విక్రయాలకు అనుమతి ఉంటుంది. పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే రాష్ట్రంలోని ఇతర బీచ్‌లకు కూడా ఈ విధానాన్ని విస్తరించే అవకాశాలు ఉన్నాయి.
ఇక కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. సీపీఎస్ అమలుకు ముందు నోటిఫికేషన్ల ద్వారా ఎంపికై, తర్వాత ఉద్యోగాల్లో చేరిన వారికి పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని నిర్ణయించారు. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, గురుకులాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచేందుకు ఆమోదం తెలిపారు.
రాజధాని అమరావతిలో మౌలిక వసతుల అభివృద్ధికి అనుమతులు మంజూరు చేశారు. అమరావతి ఐ ప్రాజెక్ట్ టెండర్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు, క్వాంటం వ్యాలీ ప్రాజెక్టుకు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల్లో పూర్తి మినహాయింపు కల్పించారు.
పోలవరం సహా కీలక సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసేందుకు పరిపాలనా అనుమతులు ఇచ్చారు. అలాగే ఏపీ ఏవియేషన్ పాలసీ-2026కు ఆమోదం తెలుపుతూ విమానయాన రంగ అభివృద్ధికి మార్గం సుగమం చేశారు.
బీచ్ షాక్స్ పాలసీతో ఏపీ పర్యాటక రంగానికి కొత్త గుర్తింపు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా దేశీయ, విదేశీ పర్యాటకులను ఆకర్షించడంలో ఈ నిర్ణయం కీలకంగా మారనుందని అధికారులు అంచనా వేస్తున్నారు.