
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు ప్రాంత పర్యటనకు ముందే నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాపేటలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకబడిన పాలమూరు జిల్లాను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు ప్రాంత పర్యటనకు ముందే నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాపేటలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకబడిన పాలమూరు జిల్లాను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ సందర్భంగా నిరసనకారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి, "సీఎం డౌన్ డౌన్" అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. సీఎం పర్యటనకు ముందే బీఆర్ఎస్ ముఖ్య నేతలను పోలీసులు అక్రమంగా ముందస్తు అరెస్టులు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు.
వేలాది మంది పోలీసుల రక్షణ నడుమ, భారీ బందోబస్తు మధ్య ముఖ్యమంత్రి పాలమూరు ప్రాజెక్టులను సందర్శించాల్సి రావడం సిగ్గుచేటని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు విమర్శించారు. "ప్రభుత్వానికి పాలమూరు అభివృద్ధిపై నిజంగానే చిత్తశుద్ధి ఉంటే... ఇక్కడి పెండింగ్ ప్రాజెక్టులకు ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారో ముందుగా ప్రకటించాలి. ఆ తర్వాతే సీఎం నాగర్కర్నూల్ జిల్లాలో అడుగుపెట్టాలి" అని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు సంక్షేమాన్ని పూర్తిగా గాలికొదిలేసిందని, రైతుబంధు వంటి పథకాలను నిర్లక్ష్యం చేయడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన రేవంత్ రెడ్డి.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్టులకే మళ్లీ కొబ్బరికాయలు కొడుతూ, శంకుస్థాపనలు చేయడం మినహా ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వ్యయాన్ని పెంచి, కమీషన్లు దండుకోవడానికే కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ప్రాజెక్టును ఆలస్యం చేస్తోందని ఆరోపించారు. ఈ పెండింగ్ ప్రాజెక్టుల సమస్యలపై త్వరలోనే ఒక భారీ పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నట్లు బీఆర్ఎస్ నాయకులు ప్రకటించారు. నిరసనల నేపథ్యంలో పోలీసులు పలువురు బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకోవడంపై పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇది ప్రజాస్వామ్య హక్కులపై జరిగిన దాడిగా అభివర్ణించాయి.