
ఇంటర్నెట్డెస్క్: కర్ణాటకలో డీకే శివకుమార్ సర్కార్కు ఆదిలోనే కుదుపు ఎదురైంది. బుధవారం ప్రమాణస్వీకారం చేసిన మంత్రి ఒకరు శుక్రవారం రాజీనామా చేశారు.
ఇంటర్నెట్డెస్క్: కర్ణాటకలో డీకే శివకుమార్ సర్కార్కు ఆదిలోనే కుదుపు ఎదురైంది. బుధవారం ప్రమాణస్వీకారం చేసిన మంత్రి ఒకరు శుక్రవారం రాజీనామా చేశారు. ఇష్టం లేని శాఖను కేటాయించారని అసహనం వ్యక్తం చేస్తూ రామలింగారెడ్డి (Ramalinga Reddy) నీటిపారుదల శాఖ మంత్రి బాధ్యతల నుంచి వైదొలిగారు. నగరాభివృద్ధి శాఖ ఇవ్వాలని విన్నవించినా.. తనకు అవగాహన లేని నీటిపారుదల శాఖ ఇచ్చారని అసంతృప్తి వ్యక్తంచేశారు.
జూన్ మూడు డీకే శివకుమార్ (Dk Shivakumar) సీఎంగా ప్రమాణస్వీకారం చేయగా.. 13 మందితో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. వారిలో రామలింగారెడ్డి ఒకరు. శాఖ కేటాయింపుల విషయంలో అసంతృప్తితో ఉన్న ఆయన మీడియా ఎదుట తన రాజీనామా లేఖపై సంతకం చేశారు. నగరాభివృద్ధి శాఖ కేటాయిస్తానని డీకే హామీ ఇచ్చారని చెప్పారు. ‘‘నేను ముఖ్యమంత్రిని ఏ శాఖ అడగలేదు. ఆయనే నాకు ఆ శాఖను ప్రతిపాదించారు. కానీ తర్వాత నీటిపారుదల శాఖను కేటాయించారు. అది నాకు ఆమోదయోగ్యం కాదు. అందుకే మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నాను’’ అని బెంగళూరులో మాట్లాడారు. ఇక తాను ఏ మంత్రిత్వ శాఖను ఆఫర్ చేసినా తీసుకోనని స్పష్టం చేశారు. కాంగ్రెస్తోనే ఉంటానని, ఎమ్మెల్యేగా కొనసాగుతానని వెల్లడించారు.
ఈ పరిణామాలపై భాజపా (BJP) స్పందించింది. కాంగ్రెస్లో విభేదాలు మరింత పెరుగుతాయని, ముఖ్యమంత్రి మార్పు ఆ పార్టీకి ఏ మాత్రం ఉపయోగపడదని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం అలాంటిది ఏమీ లేదని చెప్తోంది. రెడ్డి తమ పార్టీకి, రాష్ట్రానికి ముఖ్యమైన నేత అని పేర్కొంది.
డీకేకు ఈ ముఖ్యమంత్రి పదవి సవాళ్లతో కూడుకున్న వ్యవహారమేనని ఇప్పటికే విశ్లేషణలు వినిపించిన సంగతి తెలిసిందే. ఆయా వర్గాలు, సీనియర్ నేతలకు సమప్రాధాన్యం దక్కేలా చూడటం ఒక పరీక్ష అయితే, సిద్ధూను తప్పించడంతో ‘అహింద’ ఓటుబ్యాంకు దూరం కాకుండా జాగ్రత్తపడుతూ, ఒక్కలిగలను కాంగ్రెస్ వైపు తీసుకురావడం మరో పరీక్ష. నాయకత్వ బదిలీ సాఫీగా సాగినట్లు కనిపిస్తున్నా, సీఎల్పీ సమావేశంలో శాసనసభాపక్ష నేతగా శివకుమార్ పేరును ప్రతిపాదించేందుకు సిద్ధరామయ్య తొలుత ససేమిరా అన్నారు. దీన్నిబట్టి చూస్తే స్వపక్షంలోనే విపక్షాన్ని ఎదుర్కోవాల్సి రావొచ్చని చెప్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.