
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తమిళనాడులో రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి. ఈ రాష్ట్ర భాజపా మాజీ అధ్యక్షుడు కె.అన్నామలై పార్టీని వీడారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తమిళనాడులో రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి. ఈ రాష్ట్ర భాజపా మాజీ అధ్యక్షుడు కె.అన్నామలై పార్టీని వీడారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను భాజపా (BJP) జాతీయాధ్యక్షుడు నితిన్ నబిన్ శుక్రవారం ఆమోదించారు. ఈ మధ్యాహ్నం అన్నామలై (K Annamalai) మీడియాతో మాట్లాడనున్నారు. ఇందులో ఆయన తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
కొత్త పార్టీ ఏర్పాటు దిశగా అన్నామలై ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ‘తమిళగ మక్కల్ కళగం’ లేదా ‘తమిళగ మక్కల్ కట్చి’ అనే పేరుతో పార్టీని స్థాపించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ‘వియ్ లీడర్స్’ అనే ట్రస్టును నిర్వహిస్తున్నారు. దీన్ని మరింత విస్తరించి రాజకీయ ఉద్యమంగా మార్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
కర్ణాటక క్యాడర్ ఐపీఎస్ అధికారిగా ఉన్న అన్నామలై.. 2019లో ఉద్యోగానికి రాజీనామా చేసి, మోదీ పాలన స్ఫూర్తితో 2020లో భాజపాలో చేరారు. అప్పటినుంచి తమిళనాడులో (Tamil Nadu) పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, అధ్యక్షుడిగా సేవలందించారు. పాదయాత్ర చేసి పార్టీ విస్తరణకు కృషి చేశారు. అయితే, ఇటీవల జరిగిన ఎన్నికల్లో భాజపా.. అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. దీనిపై అన్నామలై అసంతృప్తి వ్యక్తంచేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే అసెంబ్లీ ఎన్నికల ముందు ఆయనను పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించడం, ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడం రాజీనామాకు కారణమైనట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.