
ప్రస్తుతం కార్లలో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ (ACC) సిస్టమ్ సాధారణంగా కనిపిస్తోంది. ముందున్న వాహనానికి అనుగుణంగా కారు వేగాన్ని తగ్గించడం లేదా పెంచడం ఈ సిస్టమ్ పని. అయితే అదే సాంకేతికతను బైక్‌లలో అమలు చేయడం చాలా క్లిష్టమైన పని. ఎందుకంటే బైక్‌లు రెండు చక్రాలపై మాత్రమే ఆధారపడతాయి. రైడర్ సమతుల్యత కీలకంగా ఉంటుంది. ఈ సవాల్‌ను అధిగమించేందుకు యమహా ప్రత్యేక సాఫ్ట్వేర్, సెన్సార్లతో కూడిన కొత్త వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. ఇది అనుభవజ్ఞుడైన రైడర్‌లా పరిస్థితులను అంచనా వేసి స్పందించేలా రూపొందిస్తున్నారు. యమహా అభివృద్ధి చేస్తున్న ACC (ఆటోమేటిక్ అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్) వ్యవస్థలో రాడార్ సెన్సార్ కీలక పాత్ర పోషిస్తుంది. బైక్ ముందు ఉన్న వాహనం వేగం తగ్గించినప్పుడు లేదా ట్రాఫిక్ కారణంగా నెమ్మదిగా కదులుతున్నప్పుడు ఈ రాడార్ వెంటనే గుర్తిస్తుంది. ఆ సమాచారాన్ని ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ (ECU) విశ్లేషించి థ్రాటిల్‌ను ఆటోమేటిక్‌గా తగ్గిస్తుంది. దీంతో బైక్ వేగం క్రమంగా తగ్గుతుంది. ఆకస్మికంగా స్పీడ్ తగ్గకపోవడంతో రైడర్‌కు అసౌకర్యం కలగదు. ఈ టెక్నాలజీలో మరో ముఖ్యమైన అంశం Y-AMT (యమహా ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్). ముందున్న వాహనం కారణంగా వేగం తగ్గాల్సి వచ్చినప్పుడు ఈ సిస్టమ్ స్వయంగా గేర్లను మార్చుతుంది. దీంతో బైక్ ఇంజిన్‌పై ఒత్తిడి తగ్గుతుంది. అలాగే తక్కువ వేగంలో ప్రయాణిస్తున్నప్పుడు ఇంజిన్ ఆగిపోవడం వంటి సమస్యలు కూడా రాకుండా ఉంటుంది. రైడర్ గేర్ మార్చాల్సిన అవసరం లేకుండా ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారుతుంది. వేగం తగ్గించడం, గేర్ మార్చడం ద్వారా పరిస్థితి అదుపులోకి రాకపోతే ఈ సిస్టమ్ నేరుగా బ్రేక్‌లను ఉపయోగిస్తుంది. ముందు, వెనుక చక్రాల బ్రేక్‌లను సమన్వయంతో ఉపయోగించి బైక్ వేగాన్ని సురక్షితంగా తగ్గిస్తుంది. అంతేకాదు, బ్రేకింగ్ సమయంలో బైక్ ముందుభాగం ఎక్కువగా కిందికి వంగకుండా ఉండేందుకు ఎలక్ట్రానిక్ సస్పెన్షన్‌ను కూడా ఆటోమేటిక్‌గా అడ్జెస్ట్ చేస్తుంది.
.