
ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్ నటుడు, దర్శకుడు రితేశ్ దేశ్‌ముఖ్ తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘రాజా శివాజీ’ బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్ నటుడు, దర్శకుడు రితేశ్ దేశ్‌ముఖ్ తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘రాజా శివాజీ’ బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది. ఈ సినిమా సక్సెస్ పార్టీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో వివాదం చెలరేగింది. ఆ వీడియోలో రితేశ్.. (Riteish Deshmukh) ఛత్రపతి శివాజీ ఫొటో ఉన్న టీషర్ట్ ధరించి డ్యాన్స్ చేయడంపై కొందరు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తంచేశారు. దీనితో పాటు, గొప్ప సినిమా తీసి దాని సక్సెస్ పార్టీలో మద్యం తీసుకొని డాన్స్ వేశారంటూ ట్రోల్స్ మొదలయ్యాయి. దీనిపై రితేశ్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందిస్తూ సుదీర్ఘ వివరణ ఇచ్చారు.
‘‘ఇటీవల విడుదలైన ‘రాజా శివాజీ’ సినిమాకు ప్రేక్షకులు అందించిన అపూర్వమైన ఆదరణను సెలబ్రేట్ చేసుకోవడానికి మేమంతా చిన్న వేడుకను ఏర్పాటుచేసుకున్నాం. దానికి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతోంది. ఒక శివ భక్తుడిగా (శివాజీ మహరాజ్ అనుచరుడిగా) దీనిపై స్పష్టత ఇవ్వడం నా బాధ్యతగా భావిస్తున్నాను. ఛత్రపతి శివాజీ మహరాజ్ ఫొటో ఉన్న టీషర్ట్ ధరించి వేడుక చేసుకోవడం వెనుక, ఆయనను అవమానించాలనే ఉద్దేశం నాకు లేదు. సినిమా ప్రమోషన్స్ కోసం నేను ఆ టీషర్ట్‌ను ధరిస్తున్నాను. ఆ రోజు కూడా ప్రమోషన్స్ ముగించుకుని నేరుగా ఈ ఈవెంట్‌కు వెళ్లాను. దీంతో నాకు డ్రెస్ మార్చుకునే సమయం లేదు. ఇక మద్యం తీసుకున్నానంటూ వస్తోన్న వార్తల్లో నిజం లేదు. నేను నా జీవితంలో ఇప్పటివరకు ఎప్పుడూ మద్యం తీసుకోలేదు. భవిష్యత్తులోనూ ఎప్పటికీ ముట్టను’’ అని స్పష్టంచేశారు.
తనవల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించమని కోరారు. ఛత్రపతి శివాజీ అంటే తనకు ఎంతో గౌరవమని అన్నారు. రితేశ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాజా శివాజీ’ చిత్రం మరాఠీ సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా సరికొత్త రికార్డు సృష్టించింది. రూ.117.41 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇందులో జెనీలియా, సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్, విద్యాబాలన్ తదితరులు కీలక పాత్రలు పోషించగా, సల్మాన్ ఖాన్ ప్రత్యేక అతిథి పాత్రలో కనిపించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.