
యద్దనపూడి: ఈ ఏడాది సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్‌గారు’ చిత్ర విజయంతో మంచి జోష్ మీదున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. మరోసారి సంక్రాంతే లక్ష్యంగా సినిమాను తీసుకొచ్చేందుకు సిద్ధవుతున్నారు. వెంకటేశ్, నందమూరి కల్యాణ్‌రామ్ కీలక పాత్రల్లో మూవీ రూపొందించనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. తన స్వగ్రామం బాపట్ల జిల్లా యద్దనపూడి మండలం చిలుకూరివారిపాలెంలో గురువారం శ్రీఆంజనేయుస్వామి సన్నిధిలో పండితుల నేతృత్వంలో నూతన మూవీ స్క్రిప్ట్‌నకు పూజలు చేయించారు. మల్టీస్టారర్ చిత్రానికి అనిల్ ఆధ్వర్యంలో సిద్ధం చేసిన స్క్రిప్ట్‌నకు పసుపు, కుంకుమ అద్ది తన తల్లిదండ్రులు రావిపూడి బ్రహ్మయ్య, అనంతలక్ష్మి చేతులమీదుగా ఆయన అందుకున్నారు. వెంట ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాయికృష్ణ, రచయిత నారాయణ, కో-డైరెక్టర్ సూర్య, ఎడిటర్ తమ్మిరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిలుకూరివారిపాలెంలో సందడి నెలకొంది. అనంతరం పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ సన్నిధిలోనూ నూతన చిత్రం విజయవంతం కావాలని స్క్రిప్ట్‌నకు పూజలు చేశారు. జులై లేదా ఆగస్టు నుంచి ఈ సినిమా మొదలయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. సంగీత దర్శకుడిగా జి.వి.ప్రకాశ్కుమార్ని ఎంపిక చేశారు. తాను రూపొందిస్తున్న కథల్ని దృష్టిలో ఉంచుకుని, ఎప్పటికప్పుడు సంగీత దర్శకుల్ని మారుస్తుంటారు అనిల్ రావిపూడి. ఈసారి జి.వి.ప్రకాశ్‌కుమార్‌కు స్వరాల బాధ్యతల్ని అప్పజెప్పారు. కథ, కథనం పరంగానూ ఈ సినిమా మరింత ప్రత్యేకంగా ఉండేలా అనిల్ రావిపూడి రచన చేసినట్లు సమాచారం. ఈ చిత్రంలో వెంకటేశ్ సరసన కీర్తిసురేశ్, కల్యాణ్‌రామ్ సరసన కృతిశెట్టి నటిస్తున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు.
.