
ఇంటర్నెట్ డెస్క్: 2007 టీ20 వరల్డ్ కప్ ప్రపంచ క్రికెట్ రూపురేఖల్ని మార్చేసిందని నిస్సందేహంగా చెప్పొచ్చు. టీ20 క్రికెట్లో అదే తొలి ప్రపంచ కప్. ధోనీ సారథ్యంలో ద్వితీయ శ్రేణి జట్టుతో బరిలోకి దిగిన భారత జట్టు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ విశ్వవిజేతగా నిలిచింది. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా టీ20 క్రికెట్‌కు క్రేజ్ పెరిగింది. ఈ క్రమంలోనే భారత్‌లో ఐపీఎల్ పుట్టుకొచ్చింది. ఇప్పుడు ఆ టోర్నీయే కాసుల వర్షం కురిపిస్తూ బీసీసీఐని ప్రపంచంలోకెల్లా అత్యంత ధనిక బోర్డుగా నిలిచేలా చేసింది. అయితే, 2007 ప్రపంచ కప్‌లో ఆడటానికి కొంతమంది ఆటగాళ్లు ఉత్సాహం చూపించలేదని.. సచిన్, ద్రవిడ్, గంగూలీ వంటి స్టార్ ఆటగాళ్లు ఇదేం పిచ్చి ఆట అని కామెంట్ చేశారని ఐపీఎల్ వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ (Lalit Modi) పేర్కొన్నారు. లండన్‌లో మీడియా నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో లలిత్ మోదీ అనేక విషయాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా 2007 టీ20 ప్రపంచ కప్ నాటి సంగతులను ఆయన గుర్తుచేసుకున్నారు. ‘‘2007లో భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నప్పుడు నేను డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న ప్రతి ఆటగాడి వద్దకు వెళ్లి టీ20 మ్యాచ్‌లు ఆడాలని కోరాను. అప్పుడు వారు నాతో ‘లలిత్ నువ్వు జోక్ చేస్తున్నావా? అసలు ఈ పిచ్చి ఆట ఏమిటి? దీన్ని ఆడటం మాకు ఇష్టం లేదు’’ అని చెప్పారు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న ప్రతి ఒక్కరిది ఇదే మాట. టీ20 ప్రపంచ కప్‌నకు బీసీసీఐ ప్రధాన జట్టును కాకుండా ద్వితీయ శ్రేణి జట్టును పంపింది. సచిన్, రాహుల్ ద్రవిడ్, సౌరభ్ గంగూలీలలో ఒక్కరూ ఆ టీ20 ప్రపంచ కప్ ఆడలేదు. ఇప్పుడు అలా జరిగితే అంగీకరిస్తారా? ప్రస్తుతం ఏ ప్రపంచ కప్కైనా ద్వితీయ శ్రేణి పంపగలరా? ప్రజలు దాన్ని ఆమోదిస్తారా?’’ అని అప్పటి సంగతులను వెల్లడించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల
నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.