
Priyamani Birthday Photos: దక్షిణాది చిత్రసీమలో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బహుభాషా నటి, మాజీ మోడల్ ప్రియమణి ఈరోజు (జూన్ 4న) తన 42వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆమెకు అభిమానులు, సినీ ప్రముఖుల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రియమణి 1984, జూన్ 4న బెంగళూరులో జన్మించారు. బెంగళూరులోనే పుట్టి పెరిగిన ఈమె సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ రంగంలో రాణించారు. ప్రస్తుతం ఈమె విజయవంతంగా 41 సంవత్సరాలు పూర్తి చేసుకుని 42వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. తెలుగులో 'ఎవరే అతగాడు' సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది. 'యమదొంగ' సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత ప్రియమణి వెనక్కి తిరిగి చూసుకోలేదు. వివిధ భాషా చిత్రాలలో ఆమె కనబరిచిన అద్భుత నటనకు గాను మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను సొంతం చేసుకున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నటించి మెప్పించిన ప్రియమణి కెరీర్లో ఎన్నో మైలురాళ్లు ఉన్నాయి. 2007లో వచ్చిన తమిళ రొమాంటిక్ డ్రామా 'పరుత్తివీరన్' చిత్రంలో పల్లెటూరి ముత్తళగి పాత్రలో ఆమె చూపించిన నటనకు గాను 'ఉత్తమ నటి'గా ప్రతిష్టాత్మక జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని అందుకున్నారు. వెండితెర పైనే కాకుండా బుల్లితెర పైనా ప్రియమణి తన హవా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం దక్షిణాదిలోని ప్రముఖ టెలివిజన్ ఛానల్స్‌లో ప్రసారమయ్యే పలు క్రేజీ డ్యాన్స్ రియాలిటీ షోలకు న్యాయనిర్ణేతగా (జడ్జ్‌గా) వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు. వెండితెరపై నటిగా, బుల్లితెరపై జడ్జ్‌గా రెండు చోట్లా రాణిస్తున్న ప్రియమణి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ హ్యాపీ బర్త్‌డే టు ప్రియమణి!