
ఇంటర్నెట్ డెస్క్: శుభ్‌మన్ గిల్ తన బ్యాటింగ్ టెక్నిక్‌ను మార్చుకోవడం వల్లే పరుగుల వరద పారిస్తున్నాడని భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. జూన్ 6 నుంచి ముల్లాన్‌పుర్ వేదికగా భారత్, అఫ్గానిస్థాన్ (IND vs AFG) మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ విధానం గురించి అశ్విన్ విశ్లేషించాడు. ‘‘శుభ్‌మన్ గిల్ ఇంగ్లాండ్‌లో అద్భుతమైన సిరీస్ ఆడాడు. కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే బ్యాటింగ్‌తోపాటు నాయకత్వంలోనూ రాణించాడు. అతను కఠిన పరిస్థితుల్లో పరుగులు సాధించి, కెప్టెన్సీ ఒత్తిడిని పరిణతితో నిర్వహించాడు. అది అతని స్థాయిని, ఎక్కువసేపు బ్యాటింగ్ చేయగల సామర్థ్యాన్ని చూపించింది. గిల్ తన టెక్నిక్‌పై, ముఖ్యంగా బ్యాట్‌ను ప్యాడ్స్‌కు దగ్గరగా ఉంచడంపై చాలా కష్టపడ్డాడు.
దీనివల్ల బ్యాట్, ప్యాడ్ మధ్య దూరం తగ్గి స్వింగ్ అవుతున్న బంతిని మరింత సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతున్నాడు. కెప్టెన్‌గా స్వదేశంలో బ్యాటింగ్‌లో గిల్ (Shubman Gill) ఇంకా తన పూర్తి సత్తా చాటలేదు. కానీ, అతని బ్యాటింగ్ శైలిలో వచ్చిన ఈ మార్పుతో స్వదేశంలో కూడా అద్భుతంగా చెలరేగిపోతాడని ఆశిస్తున్నాను. టెస్టు క్రికెట్లో అతని విజయం భారత టెస్టు జట్టు రూపురేఖలను మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రాబోయే కాలంలో బ్యాటింగ్ లైనప్‌ను ముందుండి నడిపించగల సత్తా గిల్‌కు ఉంది’’ అని అశ్విన్ వివరించాడు. గతేడాది భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బ్యాటింగ్‌లో అదరగొడుతున్నాడు. నాలుగో స్థానానికి మారిన అతను ఎనిమిది మ్యాచ్‌ల్లో 950 పరుగులు చేశాడు.
అఫ్గాన్‌తో టెస్టు మ్యాచ్‌కు తుది జట్టు కూర్పుపై ఆసక్తి నెలకొంది. కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్‌లకు చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. తొలిసారి జట్టులో చోటు దక్కించుకున్న మానవ్ సుతార్, హర్ష్ దూబేలలో ఎవరిని మూడో స్పిన్నర్‌గా ఎంచుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఈ సీజన్లో దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన హర్ష్ దూబేకు అవకాశం ఇస్తే బాగుంటుందని అశ్విన్ పేర్కొన్నాడు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.