
ఇంటర్నెట్ డెస్క్: మొన్నటి వరకూ టీ20లతో అలరించిన క్రికెటర్లు.. ఇప్పుడు టెస్టు క్రికెట్ ఆడేందుకు సిద్ధమయ్యారు. ఆ తర్వాత వన్డేలు.. ఇలా ఫార్మాట్లు మారడం చాలా కష్టమైన పని. ఇదే మాటను టీమ్ఇండియా ఆటగాడు కుల్దీప్ యాదవ్ చెబుతున్నాడు. అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్టు మ్యాచ్ కోసం భారత ప్లేయర్లు సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. శనివారం నుంచి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో కుల్దీప్ జియో హాట్‌స్టార్‌తో సంభాషించాడు. కొత్తగా వచ్చిన కుర్రాళ్లకు మార్గదర్శనం చేయాల్సిన అవసరం ఉందని సూచించాడు.
‘‘ఐపీఎల్ క్రికెట్ నుంచి ఒక్కసారి రెడ్ బాల్ గేమ్‌కు మారడం చాలా కష్టమైన ప్రక్రియ. అందుకోసం చాలా సన్నద్ధత అవసరం. నాతోపాటు మా ఆటగాళ్లకు మంచి సమయం దొరికింది. నేను పది రోజుల నుంచి టెస్టు కోసం సిద్ధమవుతున్నా. టీ20ల్లో ఎప్పుడైనా సరే ఎటాకింగ్ గేమ్ ఆడాలి. కానీ, టెస్టుల్లో అలా కుదరదు. బ్యాటర్ సమయం తీసుకొని ఆడాలి. కొందరు ఐపీఎల్ ఫైనల్ నుంచి నేరుగా టెస్టు ఆడేందుకు వస్తున్నారు. వారికి తగినంత సమయం లేదు. కాస్త సవాల్‌తో కూడుకున్న వ్యవహారమే. అయితే, కొద్ది సమయం ఉన్నప్పుడు నెట్స్‌లో చెమటోడ్చాల్సిన అవసరం ఉంది’’ అని కుల్దీప్ తెలిపాడు.
‘‘లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేయడం టెస్టుల్లో చాలా ముఖ్యం. ప్రత్యర్థి బ్యాటర్లు దూకుడుగా ఆడేందుకూ ప్రయత్నిస్తారు. వ్యూహాలు మారుస్తూ ఉండాలి. అందుకే, బౌలర్లకు సవాల్ తప్పదు. బంతిని ఫ్లైట్ చేయడం, ఎక్కువ సేపు ఎయిర్‌లోనే బంతిని ఉంచడం.. లాంటివి చిన్నగా అనిపించినా చాలా కీలకం. సీనియర్లు జడ్డూ భాయ్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేడు. అతడు రెగ్యులర్ టెస్టు ప్లేయర్. అలాగే అక్షర్ పటేల్ సేవలను మిస్ అవుతున్నాం. అయితే, చాలా మంది కుర్రాళ్లు ఉన్నారు. హర్ష్, మానవ్‌కు మంచి అవకాశం. సుందర్ కూడా టెస్టు ఆడుతున్న ప్లేయరే. కొత్తగా ఎవరు వచ్చినా వారికి జట్టులో మంచి వాతావరణం కల్పించాల్సిన బాధ్యత సీనియర్లపై ఉంటుంది. ఏదైనా సమస్య ఉంటే స్వేచ్ఛగా మనకు చెప్పగలిగేంత అవకాశం ఇవ్వాలి. ఇప్పుడున్న ఇద్దరు, ముగ్గురు కుర్రాళ్లతో మంచి అనుబంధం ఉంది. నేను వారితో తరచూ మాట్లాడుతూ ఉంటా. పిచ్, వాతావరణం.. ఏదైనా ప్రశ్నలు అడుగుతా. వారికి తెలిసిన విషయాలను పంచుకుంటా’’ అని కుల్దీప్ వెల్లడించాడు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.