
Stock market | ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. రోజంతా మోస్తరు శ్రేణిలో కదలాడిన సూచీలు.. స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు శుక్రవారం వెలువడనున్న వేళ మదుపర్లు అప్రమత్తత పాటించారు. డాలరుతో రూపాయి మారకం విలువ 95.84గా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 96.61 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు 4,469 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
సెన్సెక్స్ ఉదయం 73,935.83 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 74,346.17) నష్టాల్లో ప్రారంభమైంది. రోజంతా లాభనష్టాల మధ్య కదలాడింది. ఇంట్రాడేలో 73,807.30 - 74,544.24 మధ్య కదలాడిన సూచీ.. చివరికి 13.84 పాయింట్ల లాభంతో 74,360.01 వద్ద ముగిసింది. నిఫ్టీ 10.95 పాయింట్ల లాభంతో 23,416.55 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ 30 సూచీలో టైటాన్, ఎటర్నల్, ఐటీసీ, టెక్ మహీంద్రా, ఎస్బీఐ షేర్లు లాభపడ్డాయి. ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్సర్వ్, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, అదానీ పోర్ట్స్ షేర్లు నష్టాలు చవిచూశాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.