
ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరుకు చెందిన ప్రముఖ జ్యువెలరీ రిటైల్ సంస్థ రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్‌పై సెబీ చర్యలు చేపట్టింది. ఈ సంస్థ ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో కంపెనీ, దాని ప్రమోటర్ అయిన రాజేశ్ మెహతాను సెక్యూరిటీస్ మార్కెట్ల నుంచి తాత్కాలికంగా నిషేధించింది. దీంతో నేటి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సెషన్లో ఈ కంపెనీ షేర్లు పతనమయ్యాయి. దీని (Rajesh Exports) షేరు విలువ 5శాతం నష్టంతో లోయర్ సర్క్యూట్‌ను తాకి రూ.103.92కు పడిపోయింది.
ఈ పరిణామాల నేపథ్యంలో నేటి ట్రేడింగ్‌లో ఎల్ఐసీ (LIC) షేర్లు కూడా కుంగిపోయాయి. ఒక దశలో షేరు విలువ 1శాతానికి పైగా పడిపోయింది. ఉదయం 11 గంటల సమయంలో నిఫ్టీలో ఎల్ఐసీ షేరు విలువ 0.77శాతం నష్టంతో రూ.399.80 వద్ద ట్రేడ్ అవుతోంది. రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ కంపెనీలో ఎల్ఐసీ కి 10.80శాతం వాటాలు ఉండటమే ఈ నష్టాలకు కారణం.
రాజేశ్ ఎక్స్‌ఫోర్ట్స్ ఏకీకృత ఆదాయంలో 97-99శాతం దాని విదేశీ అనుబంధ సంస్థల నుంచే సమకూరుతోంది. ముఖ్యంగా స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేసే సంస్థ నుంచి ఈ ఆదాయం వచ్చినట్లు కంపెనీ పేర్కొంది. అయితే, ఆ అనుబంధ సంస్థల ఆర్థిక లావాదేవీలను మాత్రం కంపెనీ బహిర్గతం చేయలేదు. దీంతో సెబీ తనిఖీలు చేపట్టగా.. కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్విట్జర్లాండ్ సంస్థ స్టాండ్ఎలోన్ ఆదాయం చాలా తక్కువగా ఉండగా.. రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ మాత్రం దాన్ని పెంచి చూపించినట్లు సెబీ దర్యాప్తులో గుర్తించింది. అలా 2021-2025 ఆర్థిక సంవత్సరాల మధ్య దాదాపు రూ.15.15లక్షల కోట్ల ఆదాయం సమకూరినట్లు కంపెనీ తప్పుడు ప్రచారం చేసుకుందని సెబీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో రెగ్యులేటరీ చర్యలు చేపట్టింది.
సెబీ చర్యలపై రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ కంపెనీ స్పందిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఆర్థిక అవకతవకలంటూ వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చింది. తాము నివేదించిన ఆదాయ వివరాలన్నీ సరైనవేనని పేర్కొంది. కమ్యూనికేషన్ గ్యాప్, గందరగోళం వల్లే సెబీ ఈ ఆదేశాలు జారీ చేసి ఉంటుందని బీఎస్ఈ ఫైలింగ్‌లో వెల్లడించింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.