
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య మధ్య విభేదాలు తలెత్తినట్లు వార్తలొచ్చాయి. ఆర్సీబీతో మ్యాచ్ సమయంలో హార్దిక్ ఔటైన తర్వాత కృనాల్ పెద్దఎత్తున సంబరాలు చేసుకోవడం.. అతడిని చూస్తూ హార్దిక్ డగౌట్‌కు వెళ్లడం సోషల్ మీడియాలో వీడియోలు వైరల్‌గా మారాయి. వరుసగా ఆర్సీబీ రెండో టైటిల్ సాధించడంలో కృనాల్ పాండ్య (Krunal Pandya) కీలకపాత్ర పోషించినప్పటికీ అతడికి హార్దిక్ అభినందనలు తెలుపుతూ కనీసం ఒక్క పోస్ట్ కూడా సోషల్ మీడియాలో పెట్టలేదు. సోదరుడితో విభేదాల కారణంగానే హార్దిక్ మౌనంగా ఉన్నాడంటూ ప్రచారం జరిగింది. అయితే, వీటన్నింటిని కృనాల్ పాండ్య కొట్టిపారేశాడు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టతనిచ్చాడు.
‘‘మేం ఇద్దరం కలిసి ఆడాం. క్రికెట్‌ను ఎల్లప్పుడూ వ్యూహాత్మక, సాంకేతిక అంశాల పరంగానే చర్చించాం. మా మధ్య ఎప్పుడూ ఎంతో ఆరోగ్యకరమైన చర్చ జరుగుతూనే ఉంది. సోదరులిద్దరూ ఒకే క్రీడ ఆడుతుంటే అది ఎప్పుడూ ఒకరికొకరు సహాయపడటానికి దోహదపడుతుంది. పాండ్య కుటుంబంలో 10 ఐపీఎల్ ట్రోఫీలు ఉండటం అనేది తక్కువ సంఖ్యేమీకాదు. దేవుడి దయ ఉంది’’ అని కృనాల్ వివరించాడు. హార్దిక్ ముంబయి తరపున నాలుగు, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా ఒకసారి ఐపీఎల్ ట్రోఫీ సాధించిన విషయం తెలిసిందే. కృనాల్ ముంబయి తరఫున మూడు, ఆర్సీబీ తరఫున రెండు టైటిళ్లు సాధించాడు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.