
ఇంటర్నెట్ డెస్క్: తాను షూటింగ్ నిమిత్తం పొల్లాచిలో ఉన్నా తన మనసంతా ‘పెద్ది’ దగ్గరే ఉందని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘పెద్ది’ (Peddi) నేడు ప్రేక్షకుల ముందుకువచ్చి విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఒక తండ్రిగా, నటుడిగా తనకెంతో గర్వంగా ఉందంటూ చిరంజీవి పోస్ట్ పెట్టారు. ఈసందర్భంగా చిత్రబృందాన్ని అభినందించారు. ‘‘నేను షూటింగ్ నిమిత్తం పొల్లాచిలో ఉన్నా కూడా నా మనసంతా “పెద్ది” దగ్గరే ఉంది. గత రెండేళ్లుగా ఈ సినిమా కోసం చరణ్ పడిన కష్టం, పెట్టిన శ్రద్ధాశక్తులు అన్నీ దగ్గర నుంచి చూశాను. ఈ రోజు ప్రేక్షకుల ప్రేమ, ప్రశంసలు చూస్తుంటే ఒక తండ్రిగా మాత్రమే కాదు, ఒక నటుడిగా కూడా ఎంతో గర్వంగా అనిపిస్తోంది. ‘పెద్ది’ పాత్రలో పూర్తిగా లీనం కావడానికి తను అహర్నిశలు చేసిన కృషి, పట్టుదల, నిజాయతీ ప్రతి సన్నివేశంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ కష్టానికి దక్కిన ప్రతిఫలమే ఈ విజయం’’ అని రామ్ చరణ్‌ను (Ram Charan) చిరంజీవి ప్రశంసించారు. ‘‘ఇలాంటి అద్భుతమైన కథను రాసి, అంతే అద్భుతంగా తెరపై ఆవిష్కరించిన దర్శకుడు బుచ్చిబాబుకు ప్రత్యేక అభినందనలు. అలాగే తన తొలి చిత్రాన్నే ఇంత భారీ స్థాయిలో, ఎలాంటి రాజీ లేకుండా నిర్మించిన నిర్మాత సతీశ్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో నటించిన నా మిత్రుడు, ‘కరునాడ చక్రవర్తి’ శివరాజ్ కుమార్‌కు, అప్పలసూరి పాత్రలో అద్భుతంగా జీవించిన నా సోదర సమానుడు జగపతిబాబుకు అభినందనలు. అద్భుతమైన పాటలు, హృదయాన్ని కదిలించేలా నేపథ్య సంగీతాన్ని అందించిన ఏఆర్ రెహమాన్‌కు ప్రత్యేక అభినందనలు. ఈ సినిమా విజయంలో భాగమైన జాన్వీ కపూర్ (Janhvi Kapoor), దివ్యేందుతో పాటు సాంకేతిక నిపుణులందరికీ కంగ్రాట్స్..’’ అంటూ చిత్రబృందాన్ని అభినందించారు. ‘పెద్ది’ సాధించిన ఈ ఘన విజయం తెలుగు సినిమాకి గర్వంగా నిలవాలని, మరెన్నో మైలురాళ్లు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.
.