

- పేదలకు ఉచిత ఇళ్ల స్థలాలు
- గ్రామాల్లో 3, పట్టణాల్లో 2
- నవంబర్లో ఇళ్ల పట్టాల పంపిణీ
AP Government: ఆంధ్రప్రదేశ్లోని సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునే నిరుపేదలకు కూటమి ప్రభుత్వం అద్భుతమైన తీపి కబురు అందించింది. సొంత స్థలం లేక ఇబ్బందులు పడుతున్న అర్హులైన పేదలందరికీ ఉచితంగా ఇంటి స్థలాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణను సిద్ధం చేస్తోంది. గతంలో కంటే మెరుగ్గా గ్రామాల్లో పేదలకు 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల చొప్పున భూమిని కేటాయించేలా రెవెన్యూ శాఖ కసరత్తు వేగవంతం చేయడంతో లబ్ధిదారుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి.
4,800 ఎకరాల సేకరణ.. సీఎం చంద్రబాబు ఆదేశాలు:
నూతనంగా దాదాపు 1,24,873 మందికి ఇంటి స్థలాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇందుకోసం సుమారు 4,800 ఎకరాల భూమి అవసరమని అధికారులు అంచనా వేశారు. ఎకరాకు సగటున రూ.37.5 లక్షల పరిహారం చెల్లించి భూసేకరణ చేపట్టనున్నారు. ఇటీవలే కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, అర్హులైన ప్రతి పేదవాడికి త్వరితగతిన స్థలాలు పంపిణీ చేయాలని ఆదేశించడంతో అధికారులు వేగంగా రంగంలోకి దిగారు.
అక్టోబర్లో తుది జాబితా.. నవంబర్లో పట్టాలు:
ప్రభుత్వానికి(AP Government) వచ్చిన లక్షలాది దరఖాస్తులను పరిశీలించి, అక్టోబర్ నాటికి అర్హుల తుది జాబితాను సిద్ధం చేయనున్నారు. నవంబర్ నుంచి భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసి, వెంటనే అర్హులైన పేదలకు కొత్త ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్నారు. గత ప్రభుత్వంలో సెంటు స్థలం పొంది నివాసానికి దూరంగా ఉన్న వారికి కూడా నూతన మార్గదర్శకాల ప్రకారం భూమి కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నారు.





