
డిమాండు ఉన్నా ఇతర సంస్థలకంటే వెనుకంజ ఈ ఏడాది తొలి 4 నెలల్లో 16.31% క్షీణత కేంద్ర బొగ్గుశాఖ తాజా నివేదిక ఈనాడు, హైదరాబాద్‌: గతేడాది ఉత్పత్తి లక్ష్యసాధనలో విఫలమైన సింగరేణి పనితీరు ఏమాత్రం మెరుగవలేదు. దేశవ్యాప్తంగా బొగ్గుకు భారీ డిమాండు పెరుగుతున్నా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2026-27) ఏప్రిల్‌ నుంచి జులై వరకు తొలి 4 నెలల్లో 16.898 మిలియన్‌ టన్నుల ఉత్పత్తికే పరిమితమైందని, ఇతర బొగ్గు సంస్థలతో పోలిస్తే గణనీయంగా వెనుకబడిందని కేంద్ర బొగ్గుశాఖ తాజా నివేదిక తెలిపింది. గతేడాది ఇదేకాలంలో 20.19 మిలియన్‌ టన్నులు ఉత్పత్తి చేయగా ఈ ఏడాది ఏకంగా 16.31% క్షీణత నమోదైంది. ఇది సింగరేణిలో నిర్వహణ వైఫల్యాలను ఎత్తిచూపుతోంది. ఉదాహరణకు జులై నెలలో కోల్‌ ఇండియా మొత్తం ఉత్పత్తి 8.41% అదనంగా పెరిగితే, సింగరేణిలో మాత్రం 0.74% తగ్గింది. భూగర్భ గనుల్లో ఉత్పత్తి పెరగకపోగా.. ఉపరితల(ఓసీ) గనుల్లో వర్షాలతో పూర్తిస్థాయిలో ఉత్పత్తి సాధ్యంకావట్లేదని తెలుస్తోంది. సింగరేణి బొగ్గుపైనే ఆధారపడిన తెలంగాణ, కర్ణాటక, ఏపీ రాష్ట్రాల థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్లు ఇబ్బందులు పడుతున్నాయి. జీ8, జీ9 గ్రేడ్‌ వంటి నాణ్యమైన బొగ్గు సరఫరా తగ్గడంతో విద్యుదుత్పత్తి కష్టంగా మారింది. ప్రస్తుతం దేశంలోని దాదాపు మూడో వంతు విద్యుత్‌ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు అత్యల్పస్థాయికి పడిపోయాయి. ఒకవైపు వర్షాభావ పరిస్థితులతో తెలంగాణలో విద్యుత్‌ డిమాండు గరిష్ఠస్థాయిలో పెరుగుతుంటే.. మరోవైపు థర్మల్‌ ప్లాంట్లకు బొగ్గు ఉత్పత్తి తగ్గడం ఇంధనశాఖ నిర్వహణపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. బొగ్గు ఉత్పత్తి పెంచాలంటే గనుల్లో పైన ఉండే మట్టి(ఓవర్‌ బర్డెన్‌-ఓబీ)ని వేగంగా యంత్రాలతో తొలగించాలి. రోజుకి 12.1 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఓబీ తొలగించాలనేది సంస్థ లక్ష్యం. టెండర్ల ద్వారా ఈ పనులు చేపట్టిన మొత్తం 19 ఆఫ్‌ లోడింగ్‌ సంస్థల్లో 11 సంస్థలు ఆగస్టు నెలాఖరు వరకు 100% లక్ష్యాలు సాధించలేకపోయాయి. ఈ సందర్భంగా ప్రతి ఆఫ్‌ లోడింగ్‌ సంస్థ ఎన్ని షవల్స్, ఎన్ని డంపర్లు వాడుతున్నాయి? లక్ష్యాల సాధనకు ఎన్ని వాడాల్సి ఉందనే అంశాలపై సంస్థ అంతర్గతంగా విచారణ ప్రారంభించింది. మరోవైపు కొత్తగా తీసుకున్న ఉపరితల గనుల్లో మట్టి తొలగింపు ఆఫ్‌ లోడింగ్‌ టెండర్‌ ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. ఈ క్రమంలో యంత్రాల వినియోగ సామర్థ్యాన్ని పెంచడం, ఓవర్‌బర్డెన్‌ తొలగింపు వేగవంతం చేయడం, రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తేనే ఉత్పత్తి పెంపు సాధ్యమవుతుందని కేంద్రం సూచిస్తోంది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




