
ఎగుమతుల కోసం రైతులకు దన్ను అపెడా సహకారంతో వ్యవసాయశాఖ సన్నాహాలు ఆరు రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఎంపిక ఈనాడు, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందడంతోపాటు భౌగోళిక గుర్తింపు పొందిన తాండూరు కంది పప్పు ఇక రైతుల నుంచి నేరుగా విదేశాలకు ఎగుమతి కానుంది. రాష్ట్ర వ్యవసాయశాఖ శాఖ.. భారత వ్యవసాయ ఆహారోత్పత్తుల ఎగుమతుల మండలి (అపెడా) సాయంతో ప్రణాళిక రూపొందించింది. ఎల్‌నినో నేపథ్యంలో ప్రభుత్వం రాష్ట్రంలో పప్పు పంటలను ప్రత్యామ్నాయంగా ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పప్పుధాన్యాల పంటల సాగు.. లక్ష్యాన్ని మించింది. మొత్తం 6,49,397 ఎకరాలకుగాను 7,90,969 ఎకరాల్లో వేశారు. ఇందులో అత్యధికంగా కంది 5,44,681 ఎకరాలకుగాను 5,56,828 ఎకరాల్లో సాగైంది. రాష్ట్రంలో సాగవుతున్న కందుల్లో తాండూరు రకం అధికం. ప్రస్తుతం పప్పులకు తాండూరు ఒక్కటే ప్రధాన మార్కెట్‌గా ఉంది. అక్కడ సరైన ధరలు రావడం లేదు. దాంతో రైతులు వ్యాపారులకు విక్రయించాల్సి వస్తోంది. అందుకే ప్రభుత్వం ఇటీవల అపెడాతో చర్చించి ఎగుమతులపై దృష్టి సారించింది. తాండూరు కందిపప్పు 2022లో భౌగోళిక గుర్తింపు పొందింది. సాధారణ కందిపప్పుతో పోలిస్తే ఇందులో దాదాపు మూడు రెట్లు ఎక్కువ పోషక విలువలున్నాయి. తాండూరు ప్రాంతాల్లో ఆరు రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయా సంఘాల పరిధిలోనే రైతులున్నారు. ఎవరైనా లేకపోతే వాటి పరిధిలో చేరుస్తారు. ఆయా సంఘాలకు ఎగుమతుల కోసం లైసెన్స్‌ ఇస్తారు. ఎగుమతి సబ్సిడీలు, ప్రోత్సాహకాలు, బ్యాంకుల నుంచి రుణసాయం అందిస్తారు. సంఘాల్లోని రైతులకు ఎగుమతుల అవకాశాలపై శిక్షణ ఇస్తారు. పంట చేతికి వచ్చేనాటికి ఎగుమతుల కార్యాచరణను సిద్ధం చేస్తామని వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్‌ ‘ఈనాడు’కు తెలిపారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




