
ములకలచెరువు, పీటీఎం, న్యూస్‌టుడే: జిల్లాలో టమాట సాగు రైతులకు ఏటా నష్టాలు మిగుల్చుతోంది. ఏటా మే నుంచి టమాట సీజన్‌ ప్రారంభం అయినా ఏడాది పొడవునా సాగవుతుంది. రైతులు నర్సరీల నుంచి కావాల్సిన మొక్కలు కొనుగోలు చేసి సాగు చేస్తుంటారు. నర్సరీల్లో నాణ్యతలేని, నాసిరకం మొక్కలు అమ్ముతుండటంతో రైతులు పెట్టే పెట్టుబడులు నేలపాలవుతున్నాయి. మొక్క ఎదిగే వరకు కాత, పూత తెలియకపోవడంతో రైతులు 100 రోజుల కష్టం బూడిదలో పోసిన పన్నీరుగా మారుతోంది. అనుమతులు లేని నర్సరీలపై అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో ఏటా నష్టపోయే రైతుల సంఖ్య పెరుగుతోంది. మదనపల్లె, ములకలచెరువు అతిపెద్ద మార్కెట్లు కాగా, జిల్లావ్యాప్తంగా మరో 15 మార్కెట్లు ఉన్నాయి. ఇవి కాకుండా కొన్ని ప్రాంతాల్లో తోటల వద్దకే వెళ్లి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఏటా 10 లక్షల క్వింటాళ్ల టమాట ఇక్కడ ఉత్పత్తి అవుతోంది. వీటిని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. జిల్లాలో ఏడాది పొడవునా దాదాపు లక్ష ఎకరాల్లో టమాట సాగవుతోంది. 80 కోట్ల మొక్కలు అవసరమవుతాయి. కొందరు రైతులు జాగ్రత్తలు తీసుకొని నాణ్యమైన నారును కొనుగోలు చేస్తుండగా, సాధారణ రైతులు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. నాసిరకం మొక్కలు రైతులకు అంటగట్టి కొందరు నర్సరీల నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు. ఉద్యాన, వ్యవసాయ శాఖల అధికారులు పట్టించుకోకపోవడంతో నకిలీ నర్సరీల నిర్వాహకులు ఆడించే ఆటగా మారింది. జిల్లాలోని నర్సరీల్లో ఏటా కోట్లలో మొక్కలు పెంచుతారు. నకిలీ విత్తనాలు కొని నష్టపోయిన రైతులు ఆందోళనలు చేస్తే పంచాయతీలు పెట్టి అరకొరగా నష్టాన్ని చెల్లించి రాజీ చేసుకుంటున్నారు. చాలా నర్సరీల్లో నిబంధనలు అమలు కావడం లేదు. ఉద్యాన, వ్యవసాయశాఖ అధికారులకు తెలిసినా వారు పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం నర్సరీల్లో నారు పెంచే సమయం కావడంతో తనిఖీలు చేయాలని రైతులు కోరుతున్నారు. జిల్లావ్యాప్తంగా 650లకు పైగా నర్సరీలుండగా, ఒక్క మదనపల్లెలో 350కి పైగా నర్సరీలున్నాయి. పీలేరు, కురబలకోట, ములకలచెరువు, రామసముద్రం, తంబళ్లపల్లె, కలకడ, వాల్మీకిపురం, గుర్రంకొండ, సంబేపల్లి, లక్కిరెడ్డిపల్లి, చిన్నమండెం మండలాల్లో నర్సరీలున్నాయి. తంబళ్లపల్లె నియోజకవర్గంలో 230 నర్సరీలున్నట్లు అంచనా. అధికారుల లెక్కల ప్రకారం వీటిలో సగానికి మాత్రమే అనుమతులు ఉన్నాయి. నర్సరీ యాజమానులు ఉద్యానశాఖ నుంచి అనుమతి పొంది మొక్కల అమ్మకంపై రికార్డుల్లో నమోదు చేయాలి. ఏ కంపెనీ విత్తనాలు, ఎక్కడ కొనుగోలు చేశారు.. అన్న వివరాలు ఉండాలి. నారును విక్రయించే సమయంలో నర్సరీ యాజమానులు కచ్ఛితంగా రైతులకు రసీదులు ఇవ్వాలి. కానీ కొందరు యాజమానులు అనుమతులు లేకుండా దర్జాగా వాటిని నిర్వహిస్తూ నాసిరకం మొక్కలను పెంచుతూ విక్రయిస్తున్నారు. టమాట నర్సరీలు తగిన అనుమతులు పొందేలా నోటీసులు జారీ చేస్తాం. తనిఖీలు చేపట్టి యాజమానులు విత్తనాలు ఎక్కడి నుంచి తెస్తున్నారో వివరాలు పరిశీలిస్తాం. అనుమతులు లేని విత్తనాలను కొని ఉంటే చర్యలు చేపడతాం. నారు కొన్న రైతులకు రసీదులు ఇచ్చేలా ఆదేశిస్తాం. రసీదులు ఇవ్వకుంటే లైసెన్సులు రద్దు చేస్తాం. భీమేష్, ఉద్యానవనశాఖ అధికారి, ములకలచెరువు .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





