ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ ఒకవైపు ఎండలు, మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నేడు 46 మండలాల్లో తీవ్ర వేడిగాలులు, 79 మండలాల్లో వేడి గాలులు వీస్తాయని తెలిపారు. ఏలూరు, పోలవరం, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల 43 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇవాళ ఎండలతో పాటుగా పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపారు. నేడు ద్రోణి ప్రభావంతో పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయంటున్నారు. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే పిడుగులు పడే సమయంలో చెట్ల కింద, పోల్స్ దగ్గర ఉండొద్దని సూచించారు. బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అనకాపల్లి, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వానలు పడ్డాయి. పార్వతీపురం మన్యం , అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని ప్రజలు చెట్లు, హోర్డింగ్స్ కింద నిలబడకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉంటూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఐఎండీ చెన్నై రీజినల్ హెడ్ డాక్టర్ డి శివానంద ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయాన్ని అధికారికంగా సందర్శించారు. తుఫాన్లు, భారీ వర్షాలు, పిడుగుపాటు వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించేందుకు భారత వాతావరణ శాఖ, విపత్తుల నిర్వహణ సంస్థ, ఆర్టీజీఎస్ అవేర్ సంయుక్తంగా పనిచేస్తున్నాయని సంస్థ ఎగ్జిగ్యూటివ్ డైరెక్టర్ కె. కౌసర్ బానో తెలిపారు. 'సూపర్ ఎల్ నినో' ప్రభావంపై
ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. వర్షపాతంలో వచ్చే మార్పులు, తీవ్రమైన ఎండలు, మరియు కరవు పరిస్థితులను ఎదుర్కొనేందుకు తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తలపై ఇరు విభాగాల అధికారులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. రాబోయే సీజన్‌కు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.