
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Eatala Rajender Poster: తెలంగాణ రాజకీయాల్లో ఎంపీ ఈటల రాజేందర్‌పై జరుగుతున్న ప్రచారం ఒక్కసారిగా కలకలం రేపింది. బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా కొనసాగిన ఈటల బీజేపీలో చేరిన తర్వాత ఆయనకు వ్యతిరేకంగా గళం వినిపిస్తోంది. పెద్ద ఎత్తున దుష్ప్రచారం జరుగుతుండడం రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది.
ఈ క్రమంలో ఉన్నఫళంగా హైదరాబాద్‌లో పోస్టర్లు, బ్యానర్లు కలకలం రేపాయి. బీజేపీకి శాపంగా ఈటల మారాడని ప్రచారం జరగడంతో తెలంగాణ బీజేపీ స్పందించింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కీలక ప్రకటన విడుదల చేశారు. తమ ఎంపీ ఈటల రాజేందర్‌పై జరుగుతున్న ప్రచారాన్ని బీజేపీ నాయకత్వం ఖండించింది.
ఈటలను కించపరిచేలా ఏర్పాటుచేసిన బ్యానర్లను తెలంగాణ బీజేపీ నాయకులు, కార్యకర్తలు ముక్తకంఠంతో ఖండిస్తున్నామని ప్రకటించారు. ఇది ఒక నాయకుడిపై వ్యక్తిగత దాడి మాత్రమే కాదని.. తెలంగాణ బీజేపీ ఎదుగుదలను చూసి భయపడుతున్న ప్రత్యర్థి రాజకీయ శక్తుల అసురక్షిత భావానికి నిదర్శనం అని తెలంగాణ బీజేపీ తెలిపింది.
'దాదాపు 40 ఏళ్ల రాజకీయ అనుభవం కలిగిన సీనియర్ నాయకుడు ఈటల రాజేందర్.. ప్రజా జీవితంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నాయకుడు. అలాంటి వ్యక్తిని కించపరిచే ప్రయత్నం చేయడం నీచ రాజకీయాలకు పరాకాష్ఠ' అని తెలంగాణ బీజేపీ నాయకత్వం తెలిపింది.
ప్రజల్లో బీజేపీకి పెరుగుతున్న ఆదరణను జీర్ణించుకోలేని అధికార పార్టీతో పాటు ఇతర ప్రత్యర్థి శక్తుల పాత్రపై కూడా సమగ్ర విచారణ జరగాలని
బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
'తెలంగాణ బీజేపీ పూర్తిగా ఐక్యంగా ఉంది. ఇలాంటి కుట్రలు బీజేపీ ఐక్యతను దెబ్బతీయలేవు. తెలంగాణ ప్రజలు నిజాన్ని గమనిస్తున్నారు' అని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తెలిపారు. లేఖ విడుదల చేసిన వారిలో ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పాయల్ శంకర్, కాటిపల్లి వెంకట రమణ రెడ్డి, డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు, పవార్ రామరావు పటేల్, పైడి రాకేష్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, ఎమ్మెల్సీలు ఏవీఎన్ రెడ్డి, డాక్టర్ సి అంజి రెడ్డి, మల్కా కొమరయ్య ఉన్నారు.
నీ ఏడుపే బీజేపీకి శాపం ఈటల రాజేందర్‌ను లక్ష్యంగా చేసుకుని హైదరాబాద్ శివారు మేడ్చల్‌లోని ఈటెల ఇంటి వద్ద ఓఆర్ఆర్ సర్వీస్ వద్ద వెలసిన ఫ్లెక్సీలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. 'నీ ఏడుపే బీజేపీకి శాపం' అనే శీర్షికతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఈటలపై పలు విమర్శలు చేశారు. రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదని, సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదని, కేంద్ర మంత్రి పదవి దక్కలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారంటూ ఫ్లెక్సీల్లో పేర్కొన్నారు. రెండు చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించడంతో పాటు ఓటమి అనంతరం మల్కాజిగిరి ఎంపీ టికెట్ ఇచ్చింది బీజేపీ అని గుర్తు చేశారు. ప్రధాని నాయకత్వంలో గెలుపొందిన తర్వాత కూడా "నా ఇమేజ్‌తోనే గెలిచాను" అని చెప్పడం రాజకీయ నైతికత కాదని ఫ్లెక్సీల్లో విమర్శించారు. బీసీ నాయకుడు ఎదుగుతుంటే అసహనం ఎందుకని, ఎంపీ ధర్మపురి అరవింద్‌కు లభిస్తున్న ఆదరణను చూసి కడుపుమంట ఎందుకని ప్రశ్నించారు. 'నేను బీసీ నాయకుడిని.. నేనే ప్రత్యామ్నాయం' అనే భావన నుంచి బయటకు రావాలని ఈటలకు సూచిస్తూ ఫ్లెక్సీల్లో వ్యాఖ్యలు చేశారు.