ఎల్ నినో ఎఫెక్ట్.. రైతులను భయపెడుతోంది. ఎల్ నినో కారణంగా వర్షాలు తక్కువగా కురుస్తాయని.. నీటి వినియోగం తక్కువగా ఉన్న పంటలను పండించాలని ప్రభుత్వాలు రైతులకు సూచిస్తున్నాయి.
ఉత్తరాంధ్ర ప్రాంత పరిస్థితి కూడా దీనికి ఏమాత్రం మినహాయింపు కాదు. అయితే ఎల్ నినో ముప్పు పొంచి ఉన్నప్పటికీ, దీనివల్ల కురిసే సాధారణం కంటే తక్కువ వర్షపాతం అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో 'రాజ్మా' సాగుకు, దిగుబడికి అనుకూలంగా మారవచ్చని వ్యవసాయ రంగ నిపుణులు భావిస్తున్నారు.రుచిపరంగా ఉత్తమంగా ఉండే చింతపల్లి వైట్ రకం రాజ్మాను అల్లూరి జిల్లాలో సెమీ ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతపల్లి, జీకే వీధి, జి. మాడుగుల, పాడేరు, పెదబయలు, హుకుంపేట, డుంబ్రిగూడ, ముంచంగిపుట్టు మండలాల్లోని కొండ ప్రాంతాలలో, పార్వతీపురం మన్యం జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో ఈ రాజ్మాను పండిస్తారు. చాలా మంది గిరిజన రైతులు చింతపల్లి రెడ్, చింతపల్లి వైట్ రకాల రాజ్మాను సాగు చేస్తున్నారు. రాజ్మా లాభదాయకమైన పంటగా మారడంతో, ఉత్తరాంధ్రలోని కొండ ప్రాంతాల్లో దీని సాగు విస్తీర్ణం గత కొన్ని ఏళ్లుగా పెరుగుతూ వస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రస్తుతం సుమారు 15,000 నుంచి 18,000 హెక్టార్ల మేర ఉన్న రాజ్మా సాగు విస్తీర్ణం, 2026 ఖరీఫ్ సీజన్ నాటికి సుమారు 25,000 నుంచి 28,000 హెక్టార్లకు పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ రంగ నిపుణులు చెప్తున్నారు. మరోవైపు రాజ్మా విత్తనాలు బాగా మొలకెత్తడానికి.. విత్తే ముందు నీటి తడి అవసరమని.. అలాగే విత్తిన సుమారు మూడు వారాల తర్వాత నీరు పెట్టడం పంటకు చాలా కీలకమని వ్యవసాయ రంగ నిపుణులు చెప్తున్నారు. వర్షాకాలంలో రాజ్మా పంటకు తరచూ నీరు పెట్టాల్సిన అవసరం ఉండదని.. అలాగే భారీ వర్షాలు, పొలంలో నీరు నిలిచిపోవడం వంటి వాటితో పంటకు తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉందంటున్నారు. రాజ్మా సాగుకు సంబంధించి విత్తే కాలం ఆగస్టు మొదటి వారంలో ప్రారంభమవుతుందని, ఈ పంట కాలం సుమారు నాలుగు నెలలని నిపుణులు చెప్తున్నారు. అయితే రుతుపవనాలపై ఎల్ నినో ప్రభావం చూపుతోందని, అందువల్ల ఈ ఏడాది రుతుపవన వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ తక్కువ వర్షపాతం రాజ్మా పంటకు సహాయపడుతుందని పేర్కొంటున్నారు. భారీ వర్షాలు లేకపోవటంతో పంట దెబ్బతినే అవకాశం తక్కువగా ఉంటుందని చెప్తున్నారు. వర్షాలు ఎక్కువైనా, తక్కువైనా రాజ్మా పంట సాగుకు ఇబ్బందేనని.. ప్రస్తుత వాతావరణం సరిపోలుతుందని చెప్తున్నారు. మరోవైపు అల్లూరి సీతారామరాజు జిల్లాలో పండించే రాజ్మా నాణ్యత ఆధారంగా కిలో కనీసం రూ.130 నుంచి రూ.150 వరకు పలుకుతోంది. ఈ ప్రాంతంలో పండే చింతపల్లె తెల్ల రకం రాజ్మాను కొనుగోలు చేసి ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు.