
అమరావతి, జులై 4: స్వాతంత్ర్య సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ నివాళులర్పించారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పంది
స్తూ.. అల్లూరి త్యాగం, ధైర్యం, దేశభక్తి భారత జాతికి చిరస్మరణీయమని ముఖ్యమంత్రి కొనియాడారు. మన్యం వీరుడి పోరాట పటిమ, విప్లవ కార్యాచరణ అనితర సాధ్యమని మంత్రి లోకేశ్ అన్నారు. అల్లూరికి ఘన నివాళులు: సీఎం చంద్రబాబు ‘స్వాతంత్ర్య సమర చరిత్రలో అజరామరమైన అధ్యాయంగా నిలిచారు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవ పరిరక్షణ కోసం బ్రిటిష్ పాలనకు ఎదురొడ్డి అపూర్వ సాహసాన్ని ప్రదర్శించిన మహనీయుడు. ఆయన త్యాగం, ధైర్యం, దేశభక్తి యావత్ భారత జాతికి చిరస్మరణీయం. అల్లూరి సీతారామరాజు 129వ జయంతి సందర్భంగా ఆ మహావీరుడికి ఘన నివాళులు అర్పిస్తున్నాను’ అని చంద్రబాబు పోస్ట్ చేశారు. దేశానికి స్ఫూర్తిప్రదాత అల్లూరి: లోకేశ్ ‘మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. భారత స్వాతంత్ర్య ఉద్యమాన్ని విప్లవపథం వైపు నడిపిన పోరాటయోధుడు అల్లూరి సీతారామరాజు. దేశభక్తికి, త్యాగనిరతికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. ఆయన పోరాట పటిమ, విప్లవ కార్యాచరణ అనితర సాధ్యం. తెలుగుజాతికి, దేశానికి స్ఫూర్తిప్రదాతగా నిలిచిన అల్లూరి సీతారామరాజు సేవలను ఈ సందర్భంగా స్మరించుకుందాం’ అని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. ఇవి కూడా చదవండి విజయవాడలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి అల్లూరి సీతారామరాజు.. ధైర్యసాహసాలకు ప్రతీక: హోంమంత్రి అనిత Read Latest AP News And Telugu News