
యూరోపియన్ వలసదారుల రాకతో సొంత భూములను వీడిన స్థానిక అమెరికన్లు స్వతంత్ర అమెరికా గత రెండున్నర శతాబ్దాల్లో ఎంతో పురోగమించింది. ఎన్నో విజయాలు సాధించింది. అయితే ఆ విజయాల వెనుక విషాద గాథలూ తక్కువేం కాదు!
వాటిలో ప్రధానంగా ప్రస్తావించుకోవాల్సింది- అక్కడి ఆదివాసీల దుస్థితి గురించి. అమెరికాకు అసలు యజమానులైన ఈ స్థానిక (నేటివ్) అమెరికన్లు.. యూరోపియన్ వలసదారుల రాకతో సొంత భూములను వదిలి వెళ్లాల్సి వచ్చింది.
అమెరికా ప్రస్తుత జనాభాలో ఐరోపా వలసదారుల సంతానమే ఎక్కువ. వీరిని వైట్ అమెరికన్లు అంటారు. అయితే ఐరోపా వలసదారులు అడుగు పెట్టడానికి వేల ఏళ్ల ముందు నుంచే అమెరికాలో స్థానిక అమెరికన్లు నివసిస్తున్నారు. వీరినే రెడ్ ఇండియన్లు అని కూడా పిలుస్తుంటారు. నేటివ్ అమెరికన్లలో చెరోకీ, నవాహో, సియూ, అపాచీ, జునీ, హొపీ వంటి అనేక ఆదివాసీ తెగల ప్రజలు ఉండేవారు. పలు తెగలకు వేర్వేరు భాషలు, సంస్కృతులు, పాలనా వ్యవస్థలు ఉండేవి. వలసదారులు వచ్చాక భూముల కోసం జరిగిన ఘర్షణలు, యుద్ధాలు, ఐరోపా నుంచి ప్రబలిన వ్యాధులు అమెరికాలో లక్షల మంది స్థానిక ఆదివాసీల ప్రాణాలను బలి తీసుకున్నాయి.
స్వాతంత్య్రం వచ్చాక అమెరికా భూభాగం పశ్చిమ దిశగా విస్తరించిన కొద్దీ ఆదివాసీల పరిస్థితి ఇబ్బందికరంగా మారుతూ వచ్చింది. వారు తమ భూములు, అడవులు, వేట ప్రాంతాలను కోల్పోయారు. మిసిసిపీ నదికి తూర్పున నేటివ్ అమెరికన్ల యాజమాన్యంలో ఉన్న సారవంతమైన, అపార వనరులున్న భూములను వైట్ అమెరికన్లు దక్కించుకోవాలని చూడటంతో.. 1830లో అమెరికాలో ‘ఇండియన్ రిమూవల్ యాక్ట్’ వచ్చింది. ఈ చట్టం సహాయంతో స్థానిక అమెరికన్లను అమెరికాలోని తమ భూముల నుంచి బలవంతంగా ఖాళీ చేయించి.. మిసిసిపీ నదికి పశ్చిమాన ఉన్న భూభాగాలకు తరలించారు.
స్థానిక ఆదివాసీల హక్కులను పరిరక్షించాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్తూ 1829లో దేశాధ్యక్షుడిగా తన తొలి ప్రసంగం చేసిన ఆండ్రూ జాక్సన్.. ఆపై కొన్ని నెలలకే కాంగ్రెస్తో ఇండియన్ రిమూవల్ బిల్లును ఆమోదింపజేయించి చట్టంగా మార్చడం గమనార్హం.
1838లో ఆదివాసీలను ఖాళీ చేయించే తుది గడువు సమీపించినప్పుడు.. వేల మంది ఫెడరల్ సైనికులు, జార్జియా వలంటీర్లు రంగంలోకి దిగారు. చెరోకీలు సహా మరికొన్ని తెగల ప్రజలను బంధించి, దాడులు చేసి తరలించారు. కొన్నిచోట్ల హత్యాకాండకూ పాల్పడ్డారు. నాటి బలవంతపు తరలింపులో వేల మంది నేటివ్ అమెరికన్లు ప్రాణాలు కోల్పోయారు. దీనినే చరిత్రలో ‘ట్రయల్ ఆఫ్ టియర్స్’గా పిలుస్తారు.
ఆపై మెక్సికో-అమెరికా యుద్ధం (1846-48) సహా పలు ఇతర పరిణామాలతో.. అమెరికా విస్తరణ, రెడ్ ఇండియన్ల భూముల ఆక్రమణ చాలా వేగంగా జరిగిపోయింది.
ప్రస్తుతం అమెరికా జనాభాలో నేటివ్ అమెరికన్ల వాటా 3% కంటే తక్కువే. వీరు ఇప్పటికీ స్వదేశంలో సామాజిక-ఆర్థిక, చట్ట, సాంస్కృతికపరమైన ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. వీరిలో- దాదాపు 22% మంది ప్రభుత్వం తమకు (ఆదివాసీలకు) కేటాయించిన ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. 25% మంది దారిద్య్ర రేఖకు దిగువనే బతుకీడుస్తున్నారు. అమెరికా జాతీయ సగటు కంటే వీరి ఆయుర్దాయం దాదాపు 20 ఏళ్లు తక్కువగా ఉందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. నేడు అమెరికా ప్రభుత్వం నేటివ్ అమెరికన్ల హక్కులను గుర్తించినప్పటికీ, వారికి గతంలో జరిగిన అన్యాయంపై చర్చ కొనసాగుతూనే ఉంది. అమెరికాకు అసలు యజమానులైన స్థానిక అమెరికన్లు కాలక్రమంలో మరుగునపడటం దేశ చరిత్రలో ఓ విషాద గాథగా నిలిచిపోయింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.