
భారతదేశంలో ఆధ్యాత్మికతకు నిలయం. అలాగే ఎన్నో వింత సంఘటనలు జరిగే ప్రదేశాలు కూడా ఉన్నాయి. మన దేశంలోని కొన్ని పురాతన దేవాలయాలు కేవలం నిర్మాణ శైలిలోనే కాకుండా, అనేక రహస్యాలను కూడా దాచుకున్నాయి.
మరదేశంలోని ఆరు ప్రసిద్ధ దేవాలయాలలో గంటలు ఎవరూ కొట్టకుండానే తమంతట తాముగా మ్రోగుతున్నాయని చెప్పుకుంటారు. సైన్స్ ప్రకారం ఇవి గాలి వల్ల లేదా ప్రకంపనల వల్ల జరుగుతాయని భావించినప్పటికీ, భక్తులు మాత్రం దీనిని దైవలీలగా చెప్పుకుంటారు. నాగేశ్వర జ్యోతిర్లింగం, శ్రీ మహాలక్ష్మి దేవాలయం, కామాఖ్యా దేవి ఆలయం, జగన్నాథ పురి, కేదారనాథ్, చింతపూర్ణి ఆలయాలలో ఇలా జరుగుతోంది.
గుజరాత్‌లోని ద్వారకలో ఉన్న నాగేశ్వర జ్యోతిర్లింగం ఎంతో మహిమగల దేవాలయం. ఇక్కడ కొన్ని ప్రత్యేక సమయాల్లో, మనుషులెవరూ తాకకుండానే గంటలు మ్రోగడం స్థానికులు గమనించారు. శాస్త్రవేత్తలు గాలి ప్రవాహం వల్ల ఇలా జరగవచ్చని చెబుతుంటే, భక్తులు మాత్రం ఇది పరమశివుని లీలగా చెప్పుకుంటారు. అలాగే, మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో గల మహాలక్ష్మి ఆలయంలో పండుగ సమయాల్లో గంటలు వాటంతట అవే మ్రోగుతాయని అంటారు. అమ్మవారు తమ భక్తుల ప్రార్థనలను ఆలకిస్తున్నారనడానికి ఇదొక నిదర్శనమని భక్తులు భావిస్తారు.
అస్సాంలోని కామాఖ్యా దేవి ఆలయం శక్తి పీఠాలలో అత్యంత ప్రధానమైనది. ఇక్కడ అంబుబాచి మేళా సమయంలో గంటలు వింతగా మోగుతుంటాయి. ఇక ఒడిశాలోని జగన్నాథ పురి ఆలయంలో కూడా గంటలు మోగడం ఇప్పటికీ రహస్యంగానే మిగిలిపోయింది. ముఖ్యంగా ప్రధాన పూజా కార్యక్రమాల సమయంలో, గంటలు ఒక క్రమపద్ధతిలో మ్రోగడం భక్తులకు వింతైన అనుభూతిని ఇస్తుంది.
హిమాలయాల్లోని కేదారనాథ్ ఆలయం, హిమాచల్ ప్రదేశ్‌లోని చింతపూర్ణి ఆలయాలలో కూడా ఇలాగే జరుగుతుంది. కేదారనాథ్‌లో తుఫాను సమయాల్లో, అర్ధరాత్రి వేళల్లో ఎవరూ లేనప్పుడు గంటలు మ్రోగడం అక్కడి పూజారులకు కొత్తేమీ కాదు. గాలి వేగం వల్లనే కావచ్చు అని కొందరు చెబుతున్నా, ఆ ధ్వనిలో ఒక లయబద్ధత ఉండటం విశేషం. అదేవిధంగా చింతపూర్ణి ఆలయంలో ప్రార్థనల సమయంలో మ్రోగే గంటలు భక్తులకు చాలా వింతగా అనిపిస్తాయి.