
తెలంగాణ రాజకీయాల్లో అప్పులు, అభివృద్ధి, అవినీతి చుట్టూ తిరుగుతున్న సవాళ్ల రాజకీయం సరికొత్త మలుపు తిరిగింది. ఒకరినొకరు కడిగిపారేస్తామంటూ అధికార, ప్రతిపక్షాలు విసిరిన సవాళ్లు చివరకు కాంగ్రెస్ నేతల...
తెలంగాణ రాజకీయాల్లో అప్పులు, అభివృద్ధి, అవినీతి చుట్టూ తిరుగుతున్న సవాళ్ల రాజకీయం సరికొత్త మలుపు తిరిగింది. ఒకరినొకరు కడిగిపారేస్తామంటూ అధికార, ప్రతిపక్షాలు విసిరిన సవాళ్లు చివరకు కాంగ్రెస్ నేతల పలాయన ముగింపుతో సరికొత్త చర్చకు దారితీసింది. పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాల్‌ను స్వీకరిస్తూ టైం, ప్లేస్ అడిగిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు, తానే స్వయంగా తెలంగాణ భవన్‌కు వస్తానంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రతిసవాల్ విసిరారు. తీరా గురువారం ఉదయం 11 గంటలకు చర్చా వేదిక సిద్ధమయ్యాక, మంత్రి జూపల్లి ముఖం చాటేయడం అధికార కాంగ్రెస్ పార్టీని తీవ్ర ఆత్మరక్షణలో పడేసింది.
ప్రభుత్వ అప్పులపై చర్చకు తాము సిద్ధమంటూ కేటీఆర్, హరీష్ రావు అన్ని లెక్కల పత్రాలతో గురువారం ఉదయమే తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. మంత్రి జూపల్లి కోసం ప్రత్యేకంగా కుర్చీ వేసి, శాలువాతో సహా స్వాగత ఏర్పాట్లు కూడా చేశారు. అయితే, సమయం దాటిపోతున్నా మంత్రి జూపల్లి తెలంగాణ భవన్ వైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. చివరి నిమిషంలో మాట మార్చి, తెలంగాణ భవన్‌కు కాకుండా గన్‌పార్క్ వద్దకు రావాలంటూ మంత్రులు కొత్త పల్లవి అందుకోవడం వారి వెనకడుగును స్పష్టం చేసింది.
మంత్రి జూపల్లి వైఖరిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సవాల్ చేసి పారిపోవడం ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రికి, మంత్రులకు అలవాటుగా మారిందన్నారు. తానే స్వయంగా తెలంగాణ భవన్‌కు వస్తానని చెప్పి, ఇప్పుడు గన్‌పార్క్ అంటూ మాట మార్చారని ఎద్దేవా చేశారు. తీరా అక్కడికి వెళ్తే చార్మినార్ అనరనే గ్యారెంటీ ఏంటని కేటీఆర్ ప్రశ్నించారు.
ప్రతిపక్ష నేతలు చర్చకు బయలుదేరితే పోలీసులను అడ్డం పెట్టుకుని, తెలంగాణ భవన్ దాటకముందే అరెస్టులు చేయిస్తూ ప్రభుత్వం డ్రామాలు ఆడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు మంత్రి జూపల్లికి తన సొంత శాఖపైనే అవగాహన లేదని, ముఖ్యమంత్రితో ఉన్న విభేదాల వల్లే ఒక ఉన్నతాధికారి ఉద్యోగం వదిలి వెళ్లిపోయారని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పాలన ఒక అసమర్థుడి జీవనయాత్రలా సాగుతోందని ధ్వజమెత్తారు.
మరోవైపు, తానే స్వయంగా సవాల్ విసిరి, తీరా చర్చా సమయానికి తెలంగాణ భవన్‌కు వెళ్లకుండా జూపల్లి కృష్ణారావు వెనకడుగు వేయడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. పార్టీ ప్రతిష్టను పణంగా పెడుతూ, ప్రతిపక్షానికి అయాచితంగా పొలిటికల్ మైలేజ్ ఇచ్చేలా జూపల్లి వ్యవహరించడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
సవాల్ విసిరినప్పుడు ధైర్యంగా వెళ్లి బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టాల్సింది పోయి, ఇలా పారిపోవడం వల్ల ప్రభుత్వానికే చెడ్డపేరు వస్తుందని రేవంత్ రెడ్డి క్లాస్ పీకినట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మంత్రుల మధ్య సమన్వయ లోపం, వ్యూహాత్మక తప్పిదాల వల్లే కాంగ్రెస్ పార్టీ ఈ చర్చల పోరులో ఘోరంగా వైఫల్యం చెందిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సవాళ్లు విసిరి పారిపోయే కాంగ్రెస్ నైజాన్ని ఎండగడుతూ, ఈ అంశంపై అసెంబ్లీలోనైనా సమగ్ర చర్చకు తాము సిద్ధమని కేటీఆర్ డిమాండ్ చేశారు. సభలో స్పీకర్ ఎలాగో అధికార పక్షానికే రక్షణగా ఉంటారు కాబట్టి, తమకు ఎలాంటి అడ్డంకులు లేకుండా గంట పాటు మైక్ ఇస్తే తాము మాట్లాడటానికి సిద్ధమని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష ఇళ్లు నిర్మించిందని, ఈ రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో కనీసం ఒక్క ఇల్లయినా నిర్మించారా అని సవాల్ విసిరారు. మొత్తానికి ఈ ‘సవాళ్ల’ ఎపిసోడ్లో కాంగ్రెస్ వెనకడుగు వేయడం, బీఆర్ఎస్కు రాజకీయంగా కలిసివచ్చినట్లయింది.