Power Sector Stocks Crash : భారత ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఒక కీలక నిర్ణయం కారణంగా భారత విద్యుత్ రంగ కంపెనీల షేర్లు భారీగా పతనం అవుతున్నాయి.
విద్యుత్ రంగంలోని ప్రభుత్వ టెండర్లలో పాల్గొనేందుకు భారత్ ఇప్పుడు నాలుగు చైనా కంపెనీలకు రెండేళ్ల పాటు మినహాయింపులు ఇవ్వడమే కారణంగా తెలుస్తోంది. 2020 గల్వాన్ ఘర్షణల తర్వాత చైనా కంపెనీలపై భారత్ కఠిన ఆంక్షలు విధించగా ఇప్పుడు సడలిస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం వల్ల చైనా కంపెనీలతో పోటీ పెరిగి దేశీయ విద్యుత్ పరికరాల కంపెనీల ఆదాయాలు లేదా లాభాలు తగ్గుతాయన్న భయాలు ఇన్వెస్టర్లలో అమ్మకాల ఒత్తిడికి దారితీసింది. పలు విద్యుత్ కంపెనీల స్టాక్స్ 10 శాతం వరకు కుదేలయ్యాయి. దీంతో ఇన్వెస్టర్లు భారీగా నష్టపోతున్నారని చెప్పొచ్చు. ఈ స్టాక్స్‌లో జీఈ వెర్నోవా టీఅండ్‌డీ, హితాచీ ఎనర్జీ ఇండియా (పవర్ ఇండియా), సీమెన్స్ ఎనర్జీ, సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ వంటి షేర్లు ఉన్నాయి. ఇందులో పవర్ ఇండియా షేరు చూస్తే అన్నింటికంటే ఎక్కువగా కుదేలైనట్లు తెలుస్తోంది. కిందటి రోజు ఇది రూ. 33,775 వద్ద ముగియగా ఇవాళ దాదాపు 3 శాతం నష్టంతో ప్రారంభమై ఇంట్రాడేలో 10 శాతం వరకు పడిపోయింది. ఈ క్రమంలోనే రూ. 30,400 వద్ద సెషన్ కనిష్ఠాన్ని నమోదు చేసింది. ఇక్కడ కిందటి రోజు క్లోజింగ్ ధరతో చూస్తే స్టాక్ ప్రైస్ ఏకంగా రూ. 3375 పడిపోవడం గమనార్హం. ప్రస్తుతం వార్త రాస్తున్న సమయంలో 9.50 శాతం పతనంతో రూ. 30,590 స్థాయిలో ట్రేడవుతోంది. ఇక్కడ చూసినా స్టాక్ ధర దాదాపు రూ. 3200 తగ్గింది. ఈ కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం రూ. 3.11 లక్షల కోట్లుగా ఉంది. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 38785 గా ఉండగా, కనిష్ఠ ధర రూ. 16111 వద్ద ఉంది. ఈ స్టాక్ ధర నెలలో 15 శాతం వరకు తగ్గగా, 6 నెలల్లో మాత్రం 61 శాతానికిపైగా పెరిగింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 66 శాతం పుంజుకుంది. ఐదేళ్లలో 1500 శాతానికిపైగా రాబడి అందించింది. మిగతా పవర్ సెక్టార్ స్టాక్స్‌లో జీఈ వెర్నోవా టీ&డీ స్టాక్ కూడా 10 శాతం వరకు తగ్గి రూ .4370 వద్ద కొనసాగుతోంది. ఒక్కో షేరు ధర ఇక్కడ రూ. 450 కిపైగా తగ్గింది. సీమెన్స్ షేరు 2 శాతం వరకు తగ్గగా, సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ షేర్లు 7 శాతం వరకు కుదేలయ్యాయి. దీంతో పవర్ స్టాక్స్ మొత్తంగా ఇన్వెస్టర్లకు నష్టాల్ని మిగిల్చాయి.