Secunderabad Railway Station Kidnap : భాగ్యనగరంలో విపరీతమైన రద్దీ కల్గిన రైల్వే స్టేషన్లలో ఒకటైన సికింద్రాబాద్ స్టేషన్లో గత నెలలో జరిగి కిడ్నాప్ కేసు గురించి అందరికీ తెలిసిందే.
ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. తనను పొరపాటున ‘డాడీ’ అని పిలిచినందుకే ఆ చిన్నారిని ఏకంగా 12 రోజుల పాటు తన ఇంట్లోనే బంధించి పెంచాలనుకున్న అతడు.. మీడియాలో వస్తున్న వరుస కథనాలకు భయపడి చిన్నారితో సహా పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. జీడిమెట్ల పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి.. బాలుడిని సురక్షితంగా కన్నతల్లి చెంతకు చేర్చారు.ప్లాట్‌ఫామ్‌పై నుంచి అదృశ్యం.. 11 రోజుల పాటు దొరక్కుండా!ఉప్పల్ చిలకానగర్ పరిధిలో నివసించే రాపు రాజేశ్వరి కుమారుడు నిఖిల్ (5) తన అమ్మమ్మ స్వరూపతో కలిసి విజయవాడ వెళ్లేందుకు జూన్ 20వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చాడు. అయితే ఇంట్లో గొడవలు రావడంతో.. ఇలా వాళ్లు ఊరెళ్లాలడానికి బయలుదేరారు. ముఖ్యంగా రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాక.. అక్కడే 1వ నంబర్ ప్లాట్‌ఫామ్‌పై స్వరూప, మనవడు నిఖిల్‌ను పక్కన కూర్చోబెట్టుకుని విశ్రాంతి తీసుకుంటుంది. ఈక్రమంలోనే స్వరూపకు నిద్ర పట్టగా.. నిఖిల్ ఆమెకు చెప్పకుండా ఆడుకుంటూ బయటకు వెళ్లాడు. ఎంతసేపటికీ బాలుడు తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన స్వరూప.. తిరిగి ఉప్పల్‌కు చేరుకుని కూతురు రాజేశ్వరికి విషయం చెప్పింది.జూన్ 21వ తేదీన వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సికింద్రాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. అందులో ఒక గుర్తు తెలియని వ్యక్తి బాలుడిని తీసుకెళ్తున్నట్లు గుర్తించినప్పటికీ.. 11 రోజులైనా బాలుడి ఆచూకీ దొరకకపోవడంతో కన్నవారు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. పోలీసులు కూడా తీవ్రంగా వెతికినా.. ఎలాంటి లాభమూ లేకపోయింది. అయితే ఈక్రమంలోనే జూలై 2వ తేదీన ఈ కేసులో ఊహించని మలుపు తిరిగింది. నేరుగా నిందితుడే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మరీ తాను కిడ్నాప్ చేసిన బాలుడిని పోలీసులకు అప్పగించాడు. అలాగే లొంగిపోయాడు. నిందితుడు ఏపీలోని రాజోలుకు చెందిన షేక్ అహ్మద్ అలీ కాగా.. ప్రస్తుతం హైదరాబాద్ చింతల్ రాంనగర్ పరిధిలో నివసిస్తున్నాడు. అయితే ఇతడు జూన్ 20వ తేదీన సికింద్రాబాద్ స్టేషన్ పరిసరాల్లో తిరుగుతున్నాడు. ఆ సమయంలో నానమ్మ నుంచి తప్పిపోయి ఏడుస్తున్న నిఖిల్.. అహ్మద్ అలీని చూసి పొరపాటున ‘డాడీ’ అని పిలిచాడు. భార్యతో గొడవల కారణంగా ఆమె తన పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోవడంతో తీవ్ర ఒంటరితనంతో బాధపడుతున్న అహ్మద్ అలీని.. ఈ బాబు డాడీ అని పిలవడంతో మురిసిపోయాడు. ఎలాగైనా సరే ఈ బాబను తానే పెంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. అలా వెంటనే నిఖిల్‌ను తీసుకుని చింతల్ రాంనగర్‌లోని తన ఇంటికి వెళ్లిపోయి.. 12 రోజుల పాటు ఎవరికీ తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా బాబును దాచిపెట్టాడు.జ్వరం డ్రామాతో పోలీసుల ముందుకు..!జూన్ 20వ తేదీ నుంచి టీవీ ఛానళ్లు, సోషల్ మీడియా, వెబ్సైట్లలో సికింద్రాబాద్ కిడ్నాప్ వార్తలు వెల్లువెత్తడం, పోలీసులు ముమ్మరంగా గాలిస్తుండటంతో అహ్మద్ అలీ తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. పోలీసులకు దొరికిపోతాననే భయంతో జూలై 2వ తేదీన ఆ బాలుడిని తీసుకుని నేరుగా జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. పోలీసులను నమ్మించేందుకు.. "బాబుకు తీవ్రమైన జ్వరం వచ్చింది. అందుకే వైద్యం చేయించడానికి నా ఇంటికి తీసుకెళ్లాను" అంటూ వింత సమాధానాలు చెప్తూ బుకాయించే ప్రయత్నం చేశాడు. కానీ పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు కిడ్నాప్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. క్షేమంగా ఉన్న ఐదేళ్ల నిఖిల్‌ను తల్లి రాజేశ్వరికి అప్పగించారు.