Modi Melody Trending Video : భారతదేశంలోనే అతిపెద్ద బిస్కెట్లు, చాక్లెట్ల తయారీ సంస్థల్లో ఒకటైన పార్లే ప్రొడక్ట్స్ ఎట్టకేలకు స్టాక్ మార్కెట్లోకి వచ్చేందుకు ప్లాన్ చేస్తోంది.
విజయ్ చౌహాన్ ఫ్యామిలీకి చెందిన ఈ సంస్థ ఇప్పుడు ఐపీఓ ప్రణాళికల్లో ఉందని తెలుస్తోంది. పార్లే- జీ, మ్యాంగో బైట్, మెలోడీ, హైడ్ అండ్ సీక్, క్రాక్ జాక్, మొనాకో ఇలా పలు బ్రాండ్లను కలిగి ఉన్న పార్లే ప్రొడక్ట్స్ ఐపీఓ కోసం దాదాపు రూ. 1 లక్ష కోట్ల విలువ లక్ష్యాన్ని పెట్టుకుందని సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. ఇంకా ఐపీఓ ద్వారా రికార్డు స్థాయిలో రూ. 9500 కోట్ల వరకు నిధుల్ని సేకరించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక వచ్చే ఏడాది ఇది ప్రైమరీ మార్కెట్లోకి వస్తుందని భావిస్తున్నారు. 'ఇది ఒక ఐకానిక్ ఇండియన్ బ్రాండ్. ఈ ఐపీఓ విలువ ఇక బిలియన్ డాలర్లకు మించే ఉంటుంది.' అని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి దీనికి సంబంధించి ప్రాథమిక చర్చలు నడుస్తున్నప్పటికీ, ఐపీఓ విలువ రూ. 1 లక్ష కోట్లకుపైనే ఉంటుందని, దానికి తగ్గట్లుగా ప్లాన్ చేస్తున్నట్లు ఈ వ్యవహారం గురించి తెలిసిన వ్యక్తుల్ని వెల్లడించారని దీనిని ఉటంకిస్తూ మనీ కంట్రోల్ పేర్కొంది. ఇక ఇష్యూ సైజ్, టార్గెట్ వాల్యుయేషన్ వంటివి అప్పటి మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఉంటుందని చెబుతున్నారు. పార్లే ప్రొడక్ట్స్ ఈ ఐపీఓ కోసం కోటక్ మహీంద్రా క్యాపిటల్, యాక్సిస్ క్యాపిటల్, హెచ్ఎస్బీసీ సెక్యూరిటీస్ వంటి పలు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లను అడ్వైజర్లుగా నియమించుకున్నట్లు తెలిసింది. ఇవి ఐపీఓ కోసం పనిచేస్తున్నట్లు సమాచారం. మరికొద్ది రోజుల్లో ఐపీఐ వివరాలు పూర్తి స్థాయిలో బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. బ్రిటానియా గట్టి పోటీ!పార్లే ప్రొడక్ట్స్‌కు పోటీగా ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో బ్రిటానియా ఇండస్ట్రీస్ (గుడ్డే, టైగర్), ఐటీసీ (సన్‌ఫీస్ట్), మోండలెజ్ ఇండియా, పర్ఫెట్టి, ప్రియా గోల్డ్, అన్మోల్ ఇండస్ట్రీస్, క్రెమికా వంటివి ఉన్నాయి. వీటిల్లో బ్రిటానియా, ఐటీసీ వంటివి స్టాక్ మార్కెట్లో ఇప్పటికే లిస్టయి ఉన్నాయి. ఇక్కడ బ్రిటానియా మార్కెట్ విలువ జులై 2 నాటికి చూస్తే ఏకంగా రూ. 1.30 లక్షల కోట్లుగా ఉంది. ఇటీవల 2025 బుర్గుండి ప్రైవేట్ హురూన్ ఇండియా 500 రిపోర్ట్ ప్రకారం అత్యధిక విలువైన అన్‌లిస్టెడ్ ఇండియన్ కంపెనీల్లో పార్లే ప్రొడక్ట్స్ 7వ స్థానంలో ఉంది. ఇదీ చూడండి: మెలోనీకి మోదీ ఇచ్చిన 'టాఫీ' వెనుక ఇంత పెద్ద కథ ఉందా? మాస్టర్ స్కెచ్చే ఇది.. పక్కా మార్కెటింగ్!ఇటీవల మే నెలలో ఇటలీ పర్యటనలో భారత ప్రధాని నరేంద్ర మోదీ- ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీకి ఈ పార్లే టాఫీని గిఫ్ట్‌గా ఇవ్వడం, ఆ వీడియో విపరీతంగా వైరల్ అవ్వడం చకచకా జరిగిపోయాయి. అప్పుడే దేశీయ బ్రాండ్ పార్లే మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఆ క్రమంలోనే ఒరిజినల్ పార్లేది అనుకొని వేరే రియల్ ఎస్టేట్ కంపెనీ పార్లే ఇండస్ట్రీస్ షేర్లలో కొనుగోళ్లు భారీగా పెరగ్గా వరుస అప్పర్ సర్క్యూట్లు కొట్టాయి. కానీ అసలు విషయం ఏంటంటే ఒరిజినల్ పార్లే ప్రొడక్ట్స్ ఇంకా లిస్టింగ్ కానే లేదు. అప్పుడే ఈ సంస్థ స్టాక్ మార్కెట్లో ఉండుంటే ఈజీ ప్రమోషన్ లభించేదని, షేర్లు ఎక్కడికో పోయేవన్న చర్చ నడిచింది. ఈ క్రమంలోనే తాజాగా సంస్థ ఐపీఓ ప్రణాళికలు చేస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.