
తాజాగా విడుదలైన టాక్సిక్ మూవీ ట్రైలర్' సృష్టించిన ఈ హైప్ అనూహ్యంగా పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'స్పిరిట్' మూవీపై కూడా అంచనాలను భారీగా పెంచేసింది.
కన్నడ రాకింగ్ స్టార్ యశ్ (Yash) కథానాయకుడిగా, టాలెంటెడ్ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ (Geetu Mohandas) దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం టాక్సిక్ (Toxic). గోవా బ్యాక్‌డ్రాప్‌లో 1950 నుంచి 1970ల మధ్య కాలంలో సాగే డ్రగ్ కార్టెల్ మాఫియా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన సరికొత్త గ్లింప్స్, టీజర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ వంటి పాన్ ఇండియా స్టార్ హీరోయిన్లు నటిస్తుండడంతో, సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అయితే, 'టాక్సిక్' సృష్టించిన ఈ హైప్ అనూహ్యంగా పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'స్పిరిట్' మూవీపై కూడా అంచనాలను భారీగా పెంచేసింది.
'టాక్సిక్' టీజర్లో కనిపించిన రగ్గడ్ లుక్స్, రా అండ్ రస్టిక్ యాక్షన్ సీన్లు, ఇంటెన్స్ బోల్డ్ కంటెంట్ చూసిన తర్వాత.. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) స్పిరిట్ (Spirit) చిత్రాన్ని ఏ రేంజ్లో తెరకెక్కిస్తాడనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' చిత్రాలతో బోల్డ్ అండ్ వయలెంట్ కంటెంట్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిన సందీప్, ప్రభాస్ (Prabhas) లాంటి భారీ కటౌట్‌ను ఎలా ప్రెజెంట్ చేస్తాడనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో పెరిగింది. ముఖ్యంగా 'టాక్సిక్' లోని బోల్డ్ ఎలిమెంట్స్ చర్చనీయాంశం కావడంతో, 'స్పిరిట్' లోని హీరోయిన్ త్రిప్తి దిమ్రి (Triptii Dimri) ని సందీప్ వంగా ఎంత గ్లామరస్‌గా, బోల్డ్‌గా చూపిస్తాడోనని నెటిజన్లు అప్పుడే లెక్కలు వేస్తున్నారు. కానీ కేవలం గ్లామర్ మాత్రమే కాకుండా, సమాజంలో పెద్ద ఎత్తున చర్చ రేపేలా ఈ చిత్రాన్ని సందీప్ రూపొందిస్తున్నట్లు సమాచారం.
ఈ రెండు చిత్రాల మధ్య పోలికలను గమనిస్తే, 'టాక్సిక్' 1950ల కాలం నాటి మాఫియా, డ్రగ్ కార్టెల్ చుట్టూ తిరిగే పీరియాడిక్ క్రైమ్ డ్రామాగా వస్తోంది. మరోవైపు 'స్పిరిట్' నేటి తరం బ్యాక్‌డ్రాప్‌లో సమాజంలోని నేరాలు, చట్టం అనే కోణంలో సాగే పవర్ ఫుల్ పోలీస్ స్టోరీగా రూపొందుతోంది. రెండింటిలోనూ కథానాయకులు విపరీతమైన కోపం, ఇంటెన్సిటీ కలిగిన పవర్ఫుల్ పాత్రలనే పోషిస్తున్నారు. యశ్ 'టాక్సిక్' లో నెగెటివ్ షేడ్స్ ఉన్న డ్రగ్ లార్డ్‌గా దుమ్మురేపడానికి సిద్ధమవుతుంటే, ప్రభాస్ 'స్పిరిట్' లో ఖాకీ యూనిఫామ్ వేసి సమాజాన్ని పట్టిపీడించే క్రిమినల్స్ వేటలో పడనున్నారు. కథాంశాలు వేరైనప్పటికీ, ఈ రెండు సినిమాల్లోని యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం ప్రేక్షకులకు సరికొత్త 'వైల్డ్' ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తాయనడంలో సందేహం లేదు.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'స్పిరిట్' కోసం ప్రభాస్ విపరీతంగా కష్టపడుతున్నారని, ఇందులోని హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్ కోసం ఆయన ఎలాంటి బాడీ డబుల్స్ వాడకుండా స్వయంగా రిస్క్ తీసుకుని నటిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. యాక్షన్ పరంగా 'టాక్సిక్' కి ఏమాత్రం తగ్గకుండా, సందీప్ రెడ్డి వంగా మార్క్ రా అండ్ రియలిస్టిక్ ఫైట్స్ ఈ సినిమాలో హైలైట్ కానున్నాయట. మొత్తానికి యశ్ 'టాక్సిక్' అందించిన ఊపు, ప్రభాస్ 'స్పిరిట్' సినిమాకు మరింత ప్లస్ అయ్యి.. బాక్సాఫీస్ వద్ద ఈ రెండు చిత్రాలు ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాయోనన్న ఆసక్తిని సినీ ప్రియుల్లో రెట్టింపు చేసింది.